ఒకప్పుడు టాలీవుడ్లో బిజీయెస్ట్ హీర్లో నారా రోహిత్ ఒకడు. ఒక సమయంలో అతడి సినిమాలు తొమ్మిది మేకింగ్ దశలో ఉన్నాయి. అంత బిజీగా ఉన్న వాడు కొన్నేళ్ల పాటు అసలు సినిమానే చేయకుండా సైలెంట్‌గా ఉండిపోయాడు. వరుస ఫ్లాపులు అతణ్ని వెనక్కి లాగేశాయి. ఈ గ్యాప్ తర్వాత ‘ప్రతినిధి-2’ చిత్రంతో అతను రీఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయ్యాడు. 2014లో వచ్చిన ‘ప్రతినిధి’ మూవీకి ఇది సీక్వెల్ తరహా మూవీ.
న్యూస్ ప్రెజెంటర్ మూర్తి ఈ చిత్రానికి దర్శకుడు కావడం విశేషం. సినిమా మొదలైనపుడు సౌండ్ చేసిన ఈ చిత్రం.. తర్వాత చాన్నాళ్ల పాటు వార్తల్లో లేకుండా పోయింది. ఒక దశలో ఈ సినిమా ఆగిపోయిందనే ప్రచారం కూడా సాగింది. కానీ అందరూ ఈ సినిమా గురించి మరిచిపోయిన టైంలో ఈ మధ్యే టీజర్‌తో పలకరించింది ‘ప్రతినిధి-2’.
టీజర్ చూస్తే విషయం ఉన్న సినిమాలాగే కనిపించింది ‘ప్రతినిధి-2’. ప్రేక్షకుల్లో మళ్లీ ఆసక్తి రేకెత్తించిన ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నెల 25న ‘ప్రతినిధి-2’ను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఇది ప్రస్తుత రాజకీయ వ్యవస్థ మీద సెటైరిక్ ఫిలిం అన్న సంగతి తెలిసిందే. టీజర్లో లోతుగా చూపించలేదు కానీ.. ఆంధ్రప్రదేశ్‌లో అధికార పార్టీ మీద ఇందులో సెటైర్లు ఉంటాయని భావిస్తున్నారు.
వైసీపీని టార్గెట్ చేస్తూ.. టీడీపీకి సపోర్ట్ చేసేలా సినిమా ఉంటుందనే అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల ముంగిట సినిమాను రిలీజ్ చేయడానికి టీం సిద్ధమైంది. ఏపీలో ఎన్నికలు మే 13న జరగనుండగా.. దానికి మూడు వారాల ముందు సినిమా థియేటర్లలోకి దిగబోతోంది. మరి జనాల మీద ‘ప్రతినిధి-2’ ఏమేర ప్రభావం చూపుతుందో చూడాలి.