భారతీయుడు 2 టెన్షన్ తీరబోతోంది

గేమ్ ఛేంజర్ తో సమానంగా భారతీయుడు 2 విడుదల కోసం రామ్ చరణ్ ఫాన్స్ ఎదురు చూస్తున్నారు. కారణం తెలిసిందే. రెండింటికి దర్శకుడు శంకర్ కావడం, రిలీజ్ డేట్లు ఫిక్స్ చేయడంలో ఆయన నిర్ణయం తప్ప నిర్మాతలకు ప్రమేయం లేకపోవడం. ఎట్టకేలకు జూన్ 13 ఇండియన్ 2 విడుదల తేదీని లాక్ చేసినట్టు చెన్నై వర్గాల నుంచి అందుతున్న సమాచారం. ఏప్రిల్ 14 ఈ విషయాన్ని ఒక టీజర్ ద్వారా ప్రకటించే ఛాన్స్ ఉన్నట్టు తెలిసింది. అప్పటికంత ఎన్నికలు, ఐపీఎల్ అన్నీ పూర్తయిపోయి ఉంటాయి కాబట్టి బ్యాలన్స్ ఉన్న వేసవి సీజన్ కమల్ హాసన్ వాడుకోవచ్చు.

భారతీయుడుకి మూడో భాగం ఉన్న నేపథ్యంలో పార్ట్ టూని వేసవిలో రిలీజ్ చేయడం ఉత్తమం. ఎలాగూ హిట్ అవుతుందన్న నమ్మకం ఉంది కాబట్టి ఆ ఫలితం తర్వాత సీక్వెల్ కి బిజినెస్ పరంగా ఉపయోగపడుతుంది. ఒకవేళ ఏదైనా తేడా జరిగినా నష్టాల తాలూకు పరిహారం సర్దేందుకు వాడుకోవచ్చు. ఏది జరిగినా వర్కౌట్ అయ్యేలా లైకా ప్రొడక్షన్స్ ప్లాన్ చేసుకుంది. ఓటిటి రైట్స్ నెట్ ఫ్లిక్స్ ఆల్రెడీ కొనేసుకుంది కనక దానికి సంబంధించిన టెన్షన్ లేదు. డబ్బింగ్ వెర్షన్ల థియేట్రికల్ రైట్స్ అమ్మలేదు. ఇంకా టైం ఉంది కాబట్టి ఎంత రేట్ వగైరా వ్యవహారాలు తేలాల్సి ఉంది.

శంకర్ సూచనల మేరకే జూన్ ని లాక్ చేశారని తెలిసింది. కమల్ హాసన్ తో పాటు కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, సిద్దార్థ్, బాబీ సింహా, బ్రహ్మానందం, ఎస్జె సూర్య లాంటి క్రేజీ క్యాస్టింగ్ ఉన్న ఇండియన్ 2కు అనిరుద్ రవిచందర్ సంగీతం ప్రత్యేక ఆకర్షణగా మారనుంది. గేమ్ ఛేంజర్ పనులు పూర్తయిపోతే కమల్ తో కలిసి ప్రమోషన్లు ప్లాన్ చేయబోతున్నారు. పాతికేళ్ల క్రితం వచ్చిన బ్లాక్ బస్టర్ కొనసాగింపు కాబట్టి ఈలోగా భారతీయుడుని మరోసారి రీ రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మొదటి భాగం తీసిన ఏఎం రత్నం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిందని సమాచారం.