ఫ్యామిలీ స్టార్ తగ్గాడండోయ్..

ఒకప్పుడు దాదాపు మూడు గంటల నిడివితో చాలా సినిమాలు వచ్చేవి. ఏ మూవీ కూడా రెండున్నర గంటలకు తగ్గేది కాదు. కానీ కాల క్రమంలో నిడివి అనేది పెద్ద సమస్యగా మారి రన్ టైం తగ్గించేయడం మొదలుపెట్టాడు. రెండు, రెండుంబావు గంటల నిడివితో సినిమాలు పెరిగాయి. కానీ ఈ మధ్య మళ్లీ రన్ టైం పెంచుతున్నారు. సినిమాలో దమ్ము ఉంటే నిడివి పెద్ద సమస్య కాదని.. ల్యాగ్ అనే మాట వినిపించదని కొన్ని సినిమాలు రుజువు చేశాయి. కానీ ఇలా ధీమాగా వచ్చే అన్ని సినిమాలూ క్లిక్ కావట్లేదు. కొన్నిసార్లు సుదీర్ఘ నిడివి సమస్యగా మారి ‘ల్యాగ్’ కంప్లైంట్లు ఎక్కువైపోతున్నాయి.

ఈ శుక్రవారం విడుదల కానున్న ‘ఫ్యామిలీ స్టార్’ 2 గంటల 43 నిమిషాల నిడివితో విడుదల కానున్నట్లు ముందు వార్తలు వచ్చాయి. ఈ సినిమా సెన్సార్ సర్టిఫికెట్లో కూడా అదే నిడివి కనిపించింది.

కానీ లేటెస్ట్‌గా రిలీజ్ చేసిన పోస్టర్లో మాత్రం రన్ టైం రెండున్నర గంటలే అని పేర్కొన్నారు. సెన్సార్‌కు పంపిన కాపీలో రన్ టైం 2 గంటల 43 నిమిషాలే అయినప్పటికీ.. ఆ తర్వాత మళ్లీ సినిమాను ఎడిటింగ్ టేబుల్ దగ్గరికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. విజయ్ చివరి సినిమా ‘ఖుషి’కి రన్ టైం కొంత సమస్యగా మారింది. ల్యాగ్ కంప్లైంట్లు వచ్చాయి. అందుకే సినిమాను క్రిస్ప్‌గా తయారు చేసి థియేటర్లలోకి దించితే మంచిదని.. చివరి నిమిషంలో మళ్లీ కత్తెరకు పని చెప్పినట్లు తెలుస్తోంది.

రెండున్నర గంటలు అనేది టాలీవుడ్లో స్టాండర్డ్ రన్ టైం. ఆ ప్రకారమే ఫైనల్ కట్ ఫిక్స్ చేసి రిలీజ్ చేస్తున్నారు. ఇది సినిమాకు కలిసొచ్చే విషయమే అని భావిస్తున్నారు. పరశురామ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో విజయ్ సరసన మృణాల్ ఠాకూర్ నటించగా.. దిల్ రాజు నిర్మించాడు.