శ్రీలీల నిర్ణయం రైటని ఒప్పుకోవచ్చు

ఒక మంచి అవకాశాన్ని వదులుకోవాలంటే హీరోయిన్లు పడే అంతర్మథనం అంతా ఇంతా కాదు. ఆది హిట్ అయినా ఫ్లాప్ అయినా లైట్ తీసుకోవాలి. బాక్సాఫీస్ వద్ద విరుచుకుపడుతున్న టిల్లు స్క్వేర్ లో అనుపమ పరమేశ్వరన్ కన్నా ముందు తీసుకున్న ఛాయస్ శ్రీలీల. కొన్ని సీన్లు షూట్ చేశారని టాక్ వచ్చింది. అయితే కొద్దిరోజులయ్యాక అందులో నుంచి బయటికి వచ్చేసింది. కథ పరంగా ఉన్న బోల్డ్ నెస్, తప్పక పెట్టాల్సిన లిప్ లాక్ కిస్సుల వల్లే డ్రాప్ అయ్యిందనే టాక్ అంతర్గతంగా వినిపించింది. కట్ చేస్తే ఆ స్థానంలో అనుపమ వచ్చి దర్శకుడు కోరుకున్నది తెరమీద ఆవిష్కరించింది.

ముఖ్యంగా క్యారెక్టర్ కు సంబంధించిన డిఫరెంట్ షేడ్స్ ని పోషించిన తీరు ఆడియన్స్ కి చాలా బాగా కనెక్ట్ అయ్యింది. ఒకవేళ ఇదే పాత్ర శ్రీలీల చేసి ఉంటే ఖచ్చితంగా తన ఇమేజ్, అవకాశాల మీద ప్రభావం పడేది. అనుపమ పక్కింటి అమ్మాయి పాత్రలు విసుగొచ్చే బోల్డ్ టర్న్ తీసుకుంది. కానీ శ్రీలీలకు ఇప్పటికిప్పుడు అంత అవసరం లేదు. అందుకే ఫైనల్ గా తన నిర్ణయం రైటేనని ఒప్పుకోవాలి. కాకపోతే ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ లో భాగం కాలేకపోవడం ఒక లోటే కానీ ఎవరైనా సరే సూటయ్యేవే ఎంచుకోవాలి కాబట్టి తొందరపడకపోవడం మంచిదే అయ్యింది.

గుంటూరు కారం ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోయినా శ్రీలీల డాన్సులకు మంచి పేరు వచ్చింది. ప్రస్తుతం తను కొత్త కమిట్ మెంట్స్ ఇవ్వలేదు. ఎంబిబిఎస్ పరీక్షల కోసం ప్రిపేరవుతోంది. నితిన్ దర్శకుడు వెంకీ కుడుముల కాంబోలో రూపొందుతున్న రాబిన్ హుద్ లో రష్మిక మందన్న డ్రాప్ అయ్యాక శ్రీలీలని తీసుకున్నారనే టాక్ వినిపించింది కానీ ఇప్పటిదాకా టీమ్ ఎలాంటి అఫీషియల్ ప్రకటన ఇవ్వలేదు. ఎన్నికల కోసం బ్రేక్ తీసుకున్న పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ మాత్రమే శ్రీలీల పూర్తి చేయాల్సిన సినిమా. ఎగ్జామ్స్ అవ్వగానే కొత్త కథలు వింటుందని సమాచారం.