కీర్తి సురేష్ గొప్ప మనసు

ఒక హీరో లేదా హీరోయిన్ కెరీర్లో తొలి అడుగులు వేస్తున్నపుడు కొన్ని చిన్న సినిమాలు ఒప్పుకుంటారు. అవి మేకింగ్ దశలో ఉండగానే వాళ్ల రేంజ్ మారిపోతుంటుంది. స్టార్ స్టేటస్ సంపాదిస్తారు. అలా ఇమేజ్ మారిన తర్వాత అప్పటికి చేస్తున్న చిన్న సినిమా వాళ్లకు సెట్ అవదు అనిపిస్తుంది.

తమ పేరును దెబ్బ తీస్తుందని, తమ స్థాయికి తగదు అన్న ఫీలింగ్ వస్తుంది. అలాంటపుడు కమిట్మెంట్‌కు కట్టుబడి ఆ సినిమాలో నటించి పేరు దెబ్బ తీసుకోవడమా.. లేక వదిలి పెట్టేయడమా అన్న మీమాంస మొదలవుతుంది. గతంలో చాలామంది హీరో హీరోయిన్లకు ఇలాంటి సమస్య ఎదురైంది. కొన్ని వివాదాలు కూడా చోటు చేసుకున్నాయి. ఇప్పుడు స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్‌కు కూడా ఇలాంటి ఇబ్బందికర పరిస్థితే ఎదురైంది.

కీర్తి ‘నేను శైలజ’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయిన సంగతి తెలిసిందే. ఐతే ఆ సినిమా కంటే ముందే ఆమె సీనియర్ నటుడు నరేష్ తనయుడు నవీన్ విజయకృష్ణ హీరోగా ‘ఐనా ఇష్టం నువ్వు’ అనే సినిమాకు సంతకం చేసింది. ఆ సినిమా చిత్రీకరణలోనూ పాల్గొంది. ఈ చిత్రం దాదాపు పూర్తి కావచ్చిన దశలో ఏవో కారణాల వల్ల ఆగిపోయింది. ఈలోపు ‘నేను శైలజ’ విడుదలై కీర్తికి టాలీవుడ్లో మంచి ఆరంభాన్నిచ్చింది. ‘నేను లోకల్’తో మరో హిట్ ఖాతాలో వేసుకున్న కీర్తి స్టార్ హీరోయిన్ అయింది.

‘మహానటి’తో తిరుగులేని పేరు ప్రఖ్యాతులు సాధించిన ఆమె జాతీయ అవార్డు సైతం అందుకుంది. ఇప్పుడు కీర్తి రేంజే వేరు. ఇలాంటి సమయంలో ‘ఐనా ఇష్టం నువ్వు’ సినిమా మళ్లీ తెరపైకి వచ్చింది. మిగిలిన కొంత చిత్రీకరణ పూర్తి చేసి దీన్ని విడుదల చేయాలని చిత్ర బృందం భావిస్తోంది.

కీర్తి మీద కూడా కొన్ని సన్నివేశాలు చిత్రీకరించాల్సి ఉండగా.. ఇప్పుడు తానున్న స్థాయికి ఆ సినిమా చాలా చిన్నదైనా సరే కీర్తి ఆ సీన్స్ పూర్తి చేయడానికి సరే అందట. నాలుగైదు రోజుల ప్యాచ్ వర్క్ మిగిలుందని, కీర్తి మీద మిగతా సన్నివేశాలు తీసి ఫస్ట్ కాపీ రెడీ చేస్తామని, థియేటర్లు తెరుచుకున్నాక సినిమాను రిలీజ్ చేస్తామని నిర్మాత చంటి అడ్డాల తెలిపాడు. రామ్ ప్రసాద్ రౌతు ఈ చిత్రానికి దర్శకుడు.