దూత 2 ఎందుకు లేదంటే

నాగ చైతన్య డిజిటల్ డెబ్యూ వెబ్ సిరీస్ దూతకు మంచి స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. థియేటర్ రిలీజులు వరస ఫ్లాపుల్లో ఉన్నప్పుడు ఇదే పెద్ద ఊరట కలిగించింది. నిన్న అమెజాన్ ప్రైమ్ కంటెంట్ లాంచ్ ఈవెంట్ లో దీనికి సీక్వెల్ ప్రకటిస్తారనే ఊహాగానాలు బలంగా వచ్చాయి. చైతు అందుకే హాజరవుతున్నాడని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. కానీ అలాంటి ఆశలు పెట్టుకున్న వాళ్లకు నిరాశ కలిగిస్తూ దూత 2ని ప్రకటించలేదు. సక్సెస్ చేసినందుకు హీరో డైరెక్టర్ ని పిలిచి థాంక్స్ చెప్పి పంపించారు తప్పించి ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు.

దీని వెనుక కారణాలున్నాయి. మొదటిది చైతు ఓటిటి స్పేస్ లో కంటిన్యూ కావాలని కోరుకోవడం లేదు. దూతకు డిమాండ్ ఉన్నా సరే కొంత గ్యాప్ తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. పైగా తండేల్ మీద భారీ నమ్మకంతో కేవలం ప్రీ ప్రొడక్షన్ కోసమే ఏడాది వెయిట్ చేశాడు. మేకోవర్ చేసుకున్నాడు. హిందీలోలా స్టార్ హీరోలు ఒకే టైంలో థియేటర్, ఓటిటిలో నటిస్తే వర్కౌట్ కాదు. ఇమేజ్ తో పాటు మార్కెట్ సమస్యలు వస్తాయి. పదే పదే చిన్ని తెరపై కనిపిస్తూ ఉంటే బిగ్ స్క్రీన్ ఎగ్జైట్ మెంట్ తగ్గిపోతుంది. బాలీవుడ్ లోనూ అజయ్ దేవగన్ లాంటి వాళ్ళు ఆచితూచి అడుగులు వేస్తున్నారు.

ఇక దర్శకుడు విక్రమ్ కుమార్ కు వేరే కమిట్ మెంట్స్ ఉన్నాయి. ఇష్క్ కాంబోని నితిన్ తో కలిసి పదిహేను సంవత్సరాల తర్వాత రిపీట్ చేయబోతున్నాడు. అఫీషియల్ అయిపోయింది కూడా. ఇది కాకుండా నాగార్జునతో సంప్రదింపుల్లో ఉన్నాడు. మరో మీడియం రేంజ్ హీరోతో చేతులు కలిపే ప్రయత్నాలు జరుగుతున్నాయి. సో దూత 2 కోసం టైం లేదు. భవిష్యత్తులో దూత బ్యాక్ డ్రాప్ లో మరో నాలుగు కథలు సిద్ధం చేస్తానని, సమయం దొరికినప్పుడు తెరకెక్కిస్తానని అంటున్నారు. వాటిలో నాగ చైతన్యనే ఉంటాడో లేక వేరే హీరోలతో ట్రై చేస్తాడో వేచి చూడాలి. సో దూత కొనసాగింపు ఇప్పట్లో లేదు.