రాజాసాబ్.. ఊహలకు అందని విధంగా

Raja Saab

మారుతి దర్శకత్వంలో ప్రభాస్ సినిమా అనగానే రెబల్ ఫ్యాన్స్ నుంచి ఎంత వ్యతిరేకత వచ్చిందో తెలిసిందే. ‘బాహుబలి’ తర్వాత తిరుగులేని ఇమేజ్ సాధించిన ప్రభాస్.. మిడ్ రేంజ్ కామెడీ సినిమాలు తీసుకునే మారుతితో జట్టు కట్టడమేంటి అన్నది వాళ్ల అసంతృప్తి. దీనికి తోడు ఈ మధ్య మారుతి ట్రాక్ రికార్డు కూడా బాలేదు. అతడి చివరి సినిమా ‘పక్కా కమర్షియల్’ డిజాస్టర్ అయింది.

ఐతే ప్రభాస్‌తో మారుతి సినిమా ప్లానింగ్ వేరే రేంజ్ అని నెమ్మది నెమ్మది అర్థమవుతోంది. ఇది హార్రర్ కామెడీ జానర్లో తెరకెక్కుతున్న సినిమా అనగానే.. మారుతి ఇంతకుముందు ఈ జానర్లో తీసిన ‘ప్రేమకథా చిత్రమ్’ టైపు రెగ్యులర్ హార్రర్ కామెడీనే అనుకున్నారు. కానీ ఈ సినిమా ప్రభాస్ రేంజికి తగ్గట్లే భారీగానే ఉంటుందని సంకేతాలు వస్తున్నాయి.

‘రాజా సాబ్’ ఒక విజువల్ వండర్‌లా ఉంటుందని.. ఇందులో విజువల్ ఎఫెక్ట్స్ భారీగా ఉంటాయని.. పెద్ద బడ్జెట్లో మంచి క్వాలిటీతో వాటిని తీర్చిదిద్దుతున్నామని నిర్మాత టీజీ విశ్వప్రసాద్ తాజాగా వెల్లడించారు. అంతే కాక ప్రేక్షకుల ఊహకు అందని విషయాలు ఈ సినిమాలో చాలా ఉంటాయని.. వాళ్లు షాకవుతారని ఆయనన్నారు.

ఇక ‘రాజా సాబ్’ రిలీజ్ డేట్ గురించి ఈ మధ్య జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్న నేపథ్యంలో దాని గురించీ విశ్వ ప్రసాద్ మాట్లాడారు. దీని కంటే ముందు ప్రభాస్ ‘కల్కి’ లాంటి భారీ చిత్రం చేస్తున్నాడని.. దాని రిలీజ్ ఖరారయ్యాకే తమ సినిమా విడుదల తేదీని నిర్ణయిస్తామని.. తమ సినిమా నుంచి ప్రమోషనల్ కంటెంట్ కూడా ఆ తర్వాతే బయటికి వస్తుందని విశ్వ ప్రసాద్ తెలిపారు. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన మాళవిక మోహనన్‌తో పాటు ఇంకో ఇద్దరు హీరోయిన్లు నటిస్తున్నట్లు తెలుస్తోంది.