తెలుగు ప్రేక్షకులు ఇప్పుడు అత్యంత ఆసక్తితో ఎదురు చూస్తున్న కొత్త సినిమా అంటే.. టిల్లు స్క్వేర్‌యే. రెండేళ్ల కిందట సెన్సేషనల్ హిట్ అయిన డీజే టిల్లుకు ఇది సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే. డీజే టిల్లు తర్వాత అవకాశాలు వెల్లువెత్తినా ఏవీ ఒప్పుకోకుండా టిల్లు పాత్రతో మరోసారి అల్లరి చేయడం మీదే ఫోకస్ పెట్టాడు సిద్ధు జొన్నలగడ్డ. అతను బాగా టైం తీసుకుని చేసిన ఈ సినిమా మరోసారి ప్రేక్షకులను ఉర్రూతలూగించేలాగే కనిపిస్తోంది.
దీని పాటలు, టీజర్, ట్రైలర్ అన్నీ కూడా క్రేజీగా అనిపించాయి. ఇంకో పది రోజుల్లోనే టిల్లు స్క్వేర్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. రిలీజ్ ముంగిట మరో ట్రైలర్ కూడా వదలాలని చూస్తోంది చిత్ర బృందం. కాగా.. ఈ సినిమా క్రూకు సంబంధించి చివరి దశలో ఓ కీలక మార్పు జరిగినట్లు సమాచారం.
డీజే టిల్లుకు బ్యాగ్రౌండ్ స్కోర్‌తో అదరగొట్టిన తమన్.. సీక్వెల్ నుంచి తప్పుకున్నాడట. ముందు తమన్‌కే నేపథ్య సంగీత బాధ్యతలు అప్పగించారు కానీ.. ఇప్పుడు అతను ఆ పని చేయట్లేదని సమాచారం. బలగం, మ్యాడ్ లాంటి చిత్రాలతో ఆకట్టుకున్న భీమ్స్ సిసిరోలియో టిల్లు స్క్వేర్‌కు స్కోర్ అందిస్తున్నాడట. మరి తమన్‌కు ఖాళీ లేక ఈ సినిమా నుంచి బ్యాగ్రౌండ్ స్కోర్ బాద్యతల నుంచి తప్పుకున్నాడా లేక వేరే కారణమేదైనా ఉందా అన్నది తెలియదు.
భీమ్స్ శైలికి తగ్గ సినిమానే కావడంతో అతను కూడా మంచి బీజీఎంయే ఇస్తాడని ఆశించవచ్చు. ఈ చిత్రానికి పాటల కంపోజింగ్ రామ్ మిరియాల, అచ్చు రాజమణి చేశారు. అవి ఇప్పటికే ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. మల్లిక్ రామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సిద్ధు సరసన అనుపమ పరమేశ్వరన్ నటించింది. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణంలో ఈ మూవీ తెరకెక్కింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates