టాలీవుడ్లోనే కాదు.. బాలీవుడ్లో అడుగు పెట్టినప్పటి నుంచి కూడా సందీప్ రెడ్డి పేరు ఓ సంచలనం. ‘అర్జున్ రెడ్డి’తో తెలుగులో సెన్సేషన్ క్రియేట్ చేశాక హిందీలో అదే సినిమాను ‘కబీర్ సింగ్’ రీమేక్ చేసి అక్కడా భారీ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు సందీప్. సినిమాను మించి దాని మీద జరిగిన చర్చ, వచ్చిన విమర్శలతో సందీప్ బాలీవుడ్లో టాక్ ఆఫ్ ద టౌన్ అయిపోయాడు. ఇక అతడి కొత్త చిత్రం ‘యానిమల్’ మీద వచ్చిన వివాదాలు, వాదోపవాదాల గురించి చెప్పడానికి చాలానే ఉంది. ఈ సినిమాను దిగ్గజ రచయిత జావెద్ అక్తర్ సహా పలువురు తప్పుబట్టారు. ఇందులో పురుషాధిక్యతను గ్లోరిఫై చేసే సీన్లున్నాయని అభ్యంతరం వ్యక్తం చేస్తూ కొన్ని సీన్లు, డైలాగులను తప్పుబట్టారు.
ఐతే తన సినిమాను తప్పుబట్టిన వాళ్లందరికీ సందీప్ గట్టిగానే రిటార్ట్ ఇచ్చారు. ‘యానిమల్’ లాంటి సినిమాలు ప్రేక్షకులపై చెడు ప్రభావం చూపుతాయన్న జావెద్ అక్తర్ విషయంలోనూ తీవ్రంగానే స్పందించాడు. తన సినిమాను తప్పుబట్టే ముందు జావెద్ కొడుకు ఫర్హాన్ అక్తర్ తీసిన ‘మీర్జాపూర్’ గురించి మాట్లాడాలని.. అందులో దారుణమైన బూతులు ఉన్నాయని సందీప్ కౌంటర్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
ఐతే సందీప్ వ్యాఖ్యలపై చాలా రోజుల గ్యాప్ తర్వాత జావెద్ అక్తర్ స్పందించారు. ‘మీర్జాపూర్’ గురించి ఆయన మాట్లాడారు. “యానిమల్ దర్శకుడిని నేను విమర్శించడం లేదు. ప్రజాస్వామ్య దేశంలో నచ్చిన చిత్రాన్ని తెరకెక్కించుకునే హక్కు అందరికీ ఉంది. ఒక్కటి కాకపోతే రెండు మూడు యానిమల్ తరహా సినిమాలు తీయమనండి. నా వ్యాఖ్యలపై ఆయన స్పందించినందుకు సంతోషం. ఐతే 53 ఏళ్ల నా సినీ ప్రస్థానంలో ఆయనకు ఎక్కడా అసభ్యకరమైన సన్నివేశాలు, మాటలు కనిపించలేదు. అందుకే నా కొడుకు ఫర్హాన్ ప్రొడ్యూస్ చేసిన ‘మీర్జాపూర్’ను ఉదాహరణగా చూపించారు. కానీ అందులో ఫర్హాన్ నటించలేదు. డైరెక్ట్ చేయలేదు. కేవలం ప్రొడ్యూస్ చేశాడంతే” అని జావెద్ అక్తర్ అన్నారు. ఐతే నటిస్తే, డైరెక్ట్ చేస్తేనే తప్పా.. ప్రొడ్యూస్ చేస్తే దాని ప్రభావం ఉండదా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.