లాల్ సలాం.. 21 రోజుల ఫుటేజ్ పోయిందట

సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రధాన పాత్రలో ఆయన తనయురాలు ఐశ్వర్య రూపొందించిన ‘లాల్ సలాం’ రజినీ కెరీర్లోనే కాక.. కోలీవుడ్ చరిత్రలోనే అతి పెద్ద డిజాస్టర్లలో ఒకటిగా నిలిచింది. మామూలుగా సూపర్ స్టార్ తొలి రోజు వచ్చే వసూళ్ల కంటే కూడా ఈ సినిమా ఫుల్ రన్ కలెక్షన్లు తక్కువ. తమిళనాట కేవలం రూ.18 కోట్ల వసూళ్లు మాత్రమే రాబట్టింది ‘లాల్ సలాం’. తెలుగులో అయితే రిలీజ్ ఖర్చులు కూడా వెనక్కి రాని పరిస్థితి.

ఈ సినిమా ట్రైలర్ చూస్తేనే సూపర్ స్టార్ అభిమానులకు నీరసం వచ్చేసింది. సినిమా అంతకంటే పేలవంగా అనిపించింది. రజినీ 45 నిమిషాలు కనిపించినా, తన వంతుగా బాగా పెర్ఫామ్ చేసినా సినిమాను కాపాడలేకపోయారు. ఐతే ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ అనుకున్న రజినీనే మైనస్ అయ్యారంటూ స్వయంగా ఐశ్వర్యే ఓ ఇంటర్వ్యూలో చెప్పడం చర్చనీయాంశం అయింది.

రజినీ కోసం కథలో మార్పులు చేర్పులు చేయడం.. ఎడిటింగ్ కూడా ఎలా పడితే అలా చేయడంతో కథ కంగాళీగా తయారైందని.. అందుకే సినిమా ప్రేక్షకులకు రుచించలేదని.. రజినీ పాత్రా సంతృప్తి పరచక, కథ కూడా సరిగ్గా కుదరక ‘లాల్ సలాం’ ఫ్లాప్ అయిందని ఆమె ఓ ఇంటర్వ్యూలో చెప్పడం వివాదాస్పదం కూడా అయింది. ఈ విషయం స్క్రిప్టు రాస్తున్నపుడు, సినిమా తీస్తున్నపుడు తెలియలేదా.. సరిగా సినిమా తీయడం రాక ఇలాంటి సాకులు చెబుతారా అంటూ ఐశ్వర్యను రజినీ ఫ్యాన్సే విమర్శించారు.

కాగా ఇప్పుడు సినిమా పరాజయానికి కొత్త కారణం చెప్పింది ఐశ్వర్య. ఈ సినిమాకు సంబంధించి 21 రోజుల ఫుటేజ్ మిస్సయిందని.. దాని వల్ల కథా గమనం దెబ్బ తిందని ఆమె ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. దీంతో ఐశ్వర్య మీద మరింత విమర్శలు తప్పలేదు. ఫుటేజ్ మిస్సయితే.. మళ్లీ ఆ సన్నివేశాలు తీయాలి కానీ, అలాగే ప్రేక్షకుల మీదికి ఎలా వదిలేస్తారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సినిమా పరాజయాన్ని అంగీకరించి ముందుకు సాగకుండా.. ఇలా రోజుకో సాకు చెప్పడం ద్వారా ఐశ్వర్య ప్రేక్షకుల్లో మరింత పలుచన అవుతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.