2/5
2 hr 30 min | Action | 08-03-2024
Cast - Gopichand, Malvika Sharma, Priya Bhavani Shankar, Naresh, Poorna, Nassar, Vennela Kishore, Rohini, and others
Director - A. Harsha
Producer - KK Radhamohan
Banner - Sri Satya Sai Arts
Music - Ravi Basrur
మాస్ లో ఫాలోయింగ్ ఉన్న గోపీచంద్ కు గత కొంత కాలంగా సరైన హిట్టు లేక అభిమానులు పడుతున్న కలవరం అంతా ఇంతా కాదు. ప్రయత్నలోపం లేకపోయినప్పటికీ ఎంపికలో జరుగుతున్న లోపాల వల్ల ఫలితాలు చాలా చేదుగా వస్తున్నాయి. అందుకే ఈసారి రూటు మార్చి సక్సెస్ లో ఉన్న కన్నడ దర్శకుడు ఏ హర్షను తీసుకొచ్చాడు గోపీచంద్. భీమా మీద ప్రత్యేకమైన నమ్మకం కలగడానికి బహుశా ఇది కూడా కారణమేమో. అంచనాలు భారీగా లేకపోయినా పబ్లిక్ టాక్ బాగుంటే పికపయ్యే ఛాన్స్ ఉన్న భీమా దాన్ని అందుకున్నాడా
కథ
పరశురాముడు కొలువైన క్షేత్రంగా చెప్పుకునే మహేంద్రపురంకు ట్రాన్స్ ఫర్ మీద వస్తాడు ఎస్ఐ భీమా(గోపిచంద్). ఊరిని గుప్పిట్లో పెట్టుకున్న స్థానిక గూండా భవాని(ముఖేష్ తివారి)కి రాగానే వార్నింగ్ ఇస్తాడు. వివాదాల వల్ల ఊళ్ళో ఏళ్ళ తరబడి మూతబడిన పాత శివాలయంని తెరిపించమని స్థానిక వైద్యుడు(నాజర్) భీమాని కోరతాడు. పెట్రోల్ ట్యాంకర్ల ద్వారా ఎన్నో అక్రమాలకు తెగబడుతున్న భవానిని అడ్డుకునే క్రమంలో భీమా మీద దుండగుల దాడి జరిగి రామా(గోపీచంద్)కు సంబంధించిన ఒక రహస్యం బయట పడుతుంది. అసలు భీమా అక్కడికి ఎందుకు వచ్చాడు, చివరికి శత్రు సంహారం ఎలా చేశాడనేది తెరమీద చూసి తెలుసుకోవాల్సిందే.
విశ్లేషణ
స్టార్ హీరోలు ఎక్కువగా మాస్ సినిమాలు చేయడానికి కారణం బిజినెస్ కోణంలో వాటికి ఉండే రీచ్ నిర్మాతకు లాభాలు ఇస్తుంది కాబట్టి. గోపిచంద్ ఈ కోణంలో ఆలోచించే గత కొంత కాలంగా మూస అనిపించినా సరే కమర్షియల్ సబ్జెక్టులకే ఓటేస్తూ వచ్చాడు. కాకపోతే రిజల్ట్స్ అచ్చిరాలేదు. ఈసారి భీమాతోనూ కొత్తగా ఎంచుకునే ప్రయత్నం చేయలేదు కానీ బ్యాక్ డ్రాప్ పరంగా దర్శకుడు హర్ష చెప్పిన పాయింట్ విభిన్నంగా అనిపించి ఒప్పుకుని ఉండొచ్చు. శాండల్ వుడ్ లో ఈ తరహా జానర్ ని శివరాజ్ కుమార్ తో టచ్ చేసి హిట్టు కొట్టిన హర్ష తెలుగు డెబ్యూకి ఈసారి అలాంటి బ్యాక్ డ్రాప్ నే ఎంచుకుని రొటీన్ ఫార్ములాతో సేఫ్ గేమ్ ఆడేందుకు ప్రయత్నించాడు.
ఖాకీ దుస్తుల్లో భీమా పరిచయంతో మొదలుపెట్టి, ఇంట్రో సాంగ్, విలన్ ఇంటికి వెళ్లి బద్రి స్టైల్ లో సరదాగా ఫైట్ చేయడం, హీరోయిన్ ని చూడగానే తొలి చూపులోనే ప్రేమించి ఆమె వెనుక సిల్లీ ట్రిక్స్ ప్లే చేస్తూ లవ్ స్టోరీ నడపడం ఇదంతా గతంలో ఎన్నోసార్లు చూసిన ఫీలింగ్ తో బోర్ కొట్టించేలా సాగుతుంది. శివాలయంకి సంబంధించిన కీలకమైన ట్విస్టుని దాచిపెడుతూ వచ్చిన హర్ష అవసరం లేని ప్రహసనాలను భీమా చుట్టూ పెట్టడంతో అక్కర్లేని ల్యాగ్ వచ్చేసింది. సీరియస్ గా అనిపించే సమస్యని సృష్టించి దాన్ని పరిష్కరించేందుకు గబ్బర్ సింగ్ తరహా వినోదాత్మక క్యారెక్టరైజేషన్ పెట్టడం సింక్ అవ్వలేదు. దీని వల్ల భీమా నలుగుతూనే ఉంటాడు.
ఇంటర్వెల్ దాకా ఇలాగే మొక్కుబడిగా సాగుతుండగా అసలు మలుపుని విశ్రాంతి దగ్గర ఓపెన్ చేస్తారు. సరే ఏదోలే ఇక్కడి నుంచైనా ట్రాక్ లో పడితే చాలనుకుంటే అన్నదమ్ములకు సంబంధించిన ఫ్లాష్ బ్యాక్ వగైరాలు తిరిగి పాత దారినే పడతాయి. గుడికి సంబంధించి ఏదో ఫాంటసీ ఎలిమెంట్ వస్తుందేమోనని ఎదురు చూసే కొద్దీ గోపిచంద్ హీరోయిజంని ఎలివేట్ చేయడంలోనే టైం గడిపేయడంతో కాస్త డిఫరెంట్ గా అనిపించిన థీమ్ కాస్తా రెగ్యులర్ గా మారిపోయింది. భీమా మన ఊహలకు అతీతంగా ఏదో చేస్తాడని ఆశిస్తే దానికి భిన్నంగా ఊహించిన దానికన్నా తక్కువగా ప్రవర్తించడం పాత్ర తాలూకు బిల్డప్ ని తగ్గిస్తూ పోయింది. ఇది అతి పెద్ద మైనస్.
చివరి అరగంట మాస్ వర్గాలు కొంత మేర సంతృప్తి పడేలా ఫైట్లు కుదిరాయి కానీ అప్పటికే పూడ్చలేనంత డ్యామేజ్ జరిగిపోయింది. బలమైన విలన్లను సెట్ చేసుకోకపోవడం మరో లోపం. గుడి బయట అఘోరాలను పెట్టిన దర్శకుడు వాళ్ళ ద్వారా భీమా ఏదో లోక కళ్యాణం కోసం అవతరించిన అభినవ పరమశివుడు రేంజ్ లో డైలాగులు చెప్పిస్తారు కానీ నిజానికి వాటికి న్యాయం చేకూరేలా సరైన ఎలివేషన్లు రాసుకుని ఉంటే నిజంగానే భీమా పేలేది. రామాతో చేయించిన అండర్ ప్లే కూడా ఒకదశ దాటాక విసుగు పుట్టిస్తుంది. అయినా సరే గోపిచంద్ స్క్రీన్ ప్రెజెన్స్, నటన వీలైనంత వరకు అవుట్ ఫుట్ మరీ దారుణం కాకుండా కొంత మేర కాపాడాయి
కాన్సెప్ట్ వరకు ఎలా ఉన్నా ట్రీట్ మెంట్ లో మాత్రం భీమా చేతులెత్తేశాడు. బోలెడు ఆర్టిస్టులు, ఘనమైన ప్రొడక్షన్ వేల్యూస్, ఆసక్తి గొలిపే గుడి సెటప్, వీటిని మించి ఎలాంటి పెర్ఫార్మన్స్ ఇవ్వడానికైనా రెడీ అనే గోపీచంద్ లాంటి హీరో ఇవేవి వీక్ రైటింగ్ ని కాచుకోలేకపోయాయి. బిర్యానీ ఎన్నిసార్లు తిన్నా బోర్ కొట్టదనే సూత్రం మాస్ సినిమాలకు సూటవ్వదు. వద్దంటున్నా అదే అదే వడ్డిస్తే తిరస్కారం తప్పదు. కాసింత కామెడీ, కూసింత యాక్షన్, పిసరంత ఎలివేషన్లతో ఆడియన్స్ ని మెప్పించే ట్రెండ్ కాదిది. వాళ్ళు థియేటర్ కు వచ్చి టికెట్లు కొని సినిమా చూడాలంటే బలమైన కంటెంట్ డిమాండ్ చేస్తున్న తరంలో ఆషామాషీ భీమాలతో పనవ్వదు.
నటీనటులు
గోపిచంద్ కష్టంలో ఎలాంటి లోపం లేదు. పైపెచ్చు ఈసారి మరింత చలాకీగా, గ్లామర్ గా అనిపించాడు. అమాయకత్వం, అరాచకం రెండు షేడ్స్ ని పోషించిన తీరు మెప్పిస్తుంది. మాళవిక శర్మ అందంతో పాటు అభినయం కూడా ఓకే. ప్రియా భవాని శంకర్ కు అంత స్కోప్ దక్కలేదు. లెన్త్ దొరికినా ఓవర్ ఎక్స్ ప్రెసివ్ అయ్యింది. వెన్నెల కిషోర్, రఘుబాబు, చమ్మక్ చంద్ర, రఘు, రోహిణి తదితరుల కామెడీ సోసోనే. ముఖేష్ తివారి గెటప్ కాస్త భయపెట్టేలా ఉన్నా దాన్ని వాడుకున్న విధానం మాత్రం అంతంతే. నాజర్ కొట్టిన పిండి తరహాలో చేసుకుంటూ పోయారు. పూర్ణ ఓ రెండు సీన్లకు పరిమితం. సీనియర్ నరేష్ తన అనుభవంతో ఎప్పట్లాగే నెట్టుకొచ్చారు
సంగీతం
కెజిఎఫ్, సలార్ లాంటి ప్యాన్ ఇండియా మూవీస్ కి పని చేసిన రవి బస్రూర్ నుంచి ఆశించిన సంగీతం కాదిది. పాటలు తేలిపోగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా రిపీట్ అనిపిస్తుందే తప్ప తెరమీద జరుగుతున్న వాటితో అంతగా సింక్ చేయించలేకపోయింది. స్వామి జె గౌడ ఛాయాగ్రహణంలో వంకలు పెట్టేందుకు లేదు. ఉన్నంతలో మంచి పనితనం చూపించారు. తమ్మిరాజు ఎడిటింగ్ ఓకే. కొంత కోత వేసినా నష్టమేమి లేదు కానీ ఎందుకో వదిలేశారు. అజ్జు మహంకాళి సంభాషణలు ఏ మాత్రం ప్రత్యేకంగా లేవు. రామ్ లక్ష్మణ్ తదితరుల యాక్షన్ కొరియోగ్రఫీ బాగానే ఉంది. నిర్మాత కెకె రాధామోహన్ ఎక్కడా రాజీ పడకుండా ఖర్చు విషయంలో అడిగిన స్వేచ్ఛ ఇచ్చేశారు
ప్లస్ పాయింట్స్
గోపీచంద్
కొన్ని ఫైట్లు
మైనస్ పాయింట్స్
ఫస్ట్ హాఫ్
లవ్ ట్రాక్స్
పండని విలనిజం
రొటీన్ ట్రీట్ మెంట్
ఫినిషింగ్ టచ్ : అయ్యో రామా
రేటింగ్ : 2/5