మట్కాకు ఆపరేషన్ చేయక తప్పదా

ఇటీవలే విడుదలైన ఆపరేషన్ వాలెంటైన్ కనీస ఓపెనింగ్స్ తెచ్చుకోవడంలోనూ విఫలం కావడం వరుణ్ తేజ్ మార్కెట్ ని తీవ్రంగా ప్రభావితం చేసేలా కనిపిస్తోంది. గత డిజాస్టర్లు గాండీవధారి అర్జున, గనిల కంటే తక్కువ ఫిగర్లు నమోదు కావడం ఆందోళన కలిగించే విషయం. వాటికన్నా కాస్తో కూస్తో డీసెంట్ కంటెంట్ ఉన్నప్పటికీ ప్రేక్షకులు ఈ స్థాయిలో తిరస్కరించడం అనూహ్యం. ప్రయోగాలు చేస్తూనే ఉంటానని మొన్నటిదాకా చెబుతూ వచ్చిన వరుణ్ తేజ్ ఇక నిర్ణయం మార్చుకోక తప్పేలా లేదు. రిస్క్ లేని గేమ్ ఆడకపోతే అసలుకే మోసం వచ్చే పరిస్థితి నెలకొంది.

ఇప్పుడు నిర్మాణంలో మట్కా ఉంది. ఇది పీరియాడిక్ డ్రామా. అరవై నుంచి ఎనభై దశకం మధ్య జరిగిన కథగా తెరకెక్కిస్తున్నారు. ఒకరకంగా చెప్పాలంటే కెజిఎఫ్ తరహా ఫ్లేవర్ లో ఒక మాఫియా డాన్ బయోపిక్ అన్నమాట. ఇప్పటికే ఒకసారి ప్రొడక్షన్ చేతులు మారింది. ఒకదశలో ఆగిపోయిందనే ప్రచారం జరిగింది కానీ అదేమీ లేదని నిర్ధారిస్తూ వరుణ్ తేజ్ పుట్టినరోజుకి చిన్న టీజర్ ని విడుదల చేశారు. క్యాస్టింగ్ కూడా పెద్దదే ఉంది. మారిన పరిస్థితుల దృష్ట్యా మట్కా బడ్జెట్ ని ఆపరేషన్ చేసి సవరించక తప్పదని ఇన్ సైడ్ టాక్. ఆ పనిలో ఉండటం వల్లే షూటింగ్ కి చిన్న బ్రేక్ ఇచ్చారని వినిపిస్తోంది.

దర్శకుడు కరుణ కుమార్ ఫామ్ లో లేకపోవడం ప్రభావం చూపించే అంశమే. పలాస తర్వాత శ్రీదేవి సోడా సెంటర్ ఫ్లాప్ కాగా కళాపురం కనీసం గుర్తు లేనంత దారుణంగా డిజాస్టరయ్యింది. అయినా సరే కథను నమ్మిన ప్రొడ్యూసర్లు మట్కా మీద భారీ బడ్జెట్ కు సిద్ధ పడ్డారు. ఈలోగా అనూహ్య పరిణామాలు చోటు చేసుకుని వరుణ్ తేజ్ బ్రాండ్ మీదే దెబ్బ పడటంతో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం వచ్చేసింది. మట్కా కొనసాగిస్తారు కానీ డిమాండ్ చేసినంత ఖర్చు జరగకపోవచ్చు. పైగా ఓటిటి, శాటిలైట్, డబ్బింగ్ డీల్ కూడా కాలేదట. చూస్తుంటే వాలెంటైన్ రగిల్చిన జ్వాలలు మట్కాకు అంటుకున్నట్టున్నాయి.