జగన్ బయోపిక్.. గాడ్ ఫాదర్ రేంజట

ఎన్టీఆర్ బయోపిక్ బాక్సాఫీస్ దగ్గర దారుణమైన ఫలితాన్నందుకున్న నేపథ్యంలో మరో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత కథ ఎలాంటి ఫలితాన్నందుకుంటుందో అని చాలామంది సందేహాలు వ్యక్తం చేశారు. కానీ తక్కువ అంచనాలతో చూడటం వల్లో ఏమో ఆ సినిమా జనాలకు బాగానే అనిపించింది.

వైఎస్ మీద ఎవరి అభిప్రాయం ఎలా ఉన్నా.. ఆ సినిమా అయితే మహి.వి.రాఘవ్ బాగా తీశాడనే చెప్పాలి. ఉన్నంతలో సినిమా బాగా ఆడింది. ఆ సినిమా రిలీజైన సమయంలోనే తాను ‘యాత్ర-2’ చేస్తానని.. అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి బయోపిక్ అని చెప్పాడు మహి. ఐతే ఇప్పుడు మన మధ్య ఉన్న వ్యక్తి బయోపిక్ తీస్తే జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారన్నది సందేహం. పైగా వైఎస్‌కు ఉన్నంత పాజిటివ్ ఇమేజ్ జగన్‌కు లేదన్నది కూడా వాస్తవం.

అసలు జగన్ జీవితంలో సినిమా తీసేంత డెప్త్ ఉందా అన్న సందేహాలు కూడా జనాల్లో ఉన్నాయి. ఇదే విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో మహిని అడిగితే జగన్ కథలో ‘గాడ్ ఫాదర్’ రేంజ్ విషయం ఉందని కామెంట్ చేయడం గమనార్హం. వైఎస్ కథను సినిమాగా చేయడానికి కష్టపడాలేమో కానీ.. జగన్ విషయంలో ఆ ఇబ్బంది లేదని అన్నాడు మహి.

ఆయన కథలో గాడ్ ఫాదర్ అంత డెప్త్ ఉందని.. హీరోయిజంతో పాటు కష్టాలు.. దరిద్రం.. అడ్మిరేషన్.. పోరాటం ఉన్నాయని.. జగన్ జీవిత కథతో సినిమా తీస్తే మంచి ఎమోషనల్ జర్నీ అవుతుందని మహి చెప్పాడు.

ఈ సినిమా తీయాలంటే జగన్ ఓకే అనాలని.. అలాగే మంచి కాస్టింగ్ కుదరాలని.. తాను ముందు రెండు వెబ్ సిరీస్‌లు, ఓ సినిమా చేసి ఆ తర్వాత అన్నీ కుదిరితే జగన్ బయోపిక్‌ను పట్టాలెక్కించాలని అనుకుంటున్నట్లు మహి తెలిపాడు. ఐతే జగన్ జీవితాన్ని గాడ్ ఫాదర్ కథతో పోలుస్తూ మహి చేసిన కామెంట్ మీద సోషల్ మీడియాలో కౌంటర్లు బాగానే పడుతున్నాయి.