‘వి’ తర్వాత తెలుగు ఓటీటీ రిలీజ్ ఇదే..

తెలుగులో పెద్ద సినిమాల ఓటీటీ రిలీజ్ విషయంలో నెలకొన్న ప్రతిష్టంభనకు తెర దించుతూ ఈ నెల ఐదో తేదీన నేచురల్ స్టార్ నాని సినిమా ‘వి’ని అమేజాన్ ప్రైమ్‌లో రిలీజ్ చేేసేశారు. తెలుగులో రిలీజైన తొలి పెద్ద సినిమా కావడంతో ఇది గేమ్ ఛేంజర్ అవుతుందని అంతా అనుకున్నారు. కానీ ఆ సినిమా అంచనాలకు తగ్గట్లు లేకపోవడంతో చూసిన వాళ్లంతా నిరాశకు గురయ్యారు. దీంతో ఒక రకమైన స్తబ్ధత నెలకొంది టాలీవుడ్లో. ఓటీటీ రిలీజ్‌కు లైన్లో ఉన్న వేరే పేరున్న సినిమాల గురించి ఏ చప్పుడూ లేదిప్పుడు. ఇలాంటి సమయంలో మరో చిన్న సినిమా ఓటీటీ విడుదలకు రంగం సిద్ధమైంది. ఆ చిత్రమే.. ఒరేయ్ బుజ్జిగా. రాజ్ తరుణ్ హీరోగా ‘గుండెజారి గల్లంతయ్యిందే’ దర్శకుడు విజయ్ కుమార్ కొండా రూపొందించిన చిత్రమిది. మాళవిక నాయర్, హెబ్బా పటేల్ కథానాయికలు.

‘ఒరేయ్ బుజ్జిగా’ చిత్ర డిజిటల్ హక్కులను అల్లు వారి ‘ఆహా’ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ సొంతం చేసుకున్నట్లు ఇంతకుముందే వార్తలొచ్చాయి. ఇది నిజమే అని రాజ్ తరుణ్ సంకేతాలిచ్చాడు. ‘ఆహా’ అనిపించే ఒక అనౌన్స్‌మెంట్ శుక్రవారం రాబోతున్నట్లు అతను ట్వీట్ చేయడం ద్వారా ఈ విషయాన్ని ధ్రువీకరించాడు. విశ్వసనీయ సమాచారం ప్రకారం ‘ఒరేయ్ బుజ్జిగా’ అక్టోబరు 2న గాంధీ జయంతి సందర్భంగా విడుదల కానుందట. ‘ఆహా’లో ఇప్పటిదాకా ‘జోహార్’ లాంటి మరీ చిన్న స్థాయి సినిమాలే రిలీజయ్యాయి. ఈ మధ్య మరీ డబ్బింగ్ సినిమాలతో సరిపెట్టేస్తుండటంతో ఆహా సబ్‌స్క్రైబర్లు జారిపోతున్నారు. ఈ నేపథ్యంలో ‘ఒరేయ్ బుజ్జిగా’తో పాటు ‘కలర్ ఫోటో’ చిత్రాల డైరెక్ట్ ఓటీటీ రిలీజ్‌కు ఆహా ఒప్పందాలు చేసుకున్నట్లు చెబుతున్నారు. లాక్ డౌన్ లేకుంటే మార్చిలోనే విడుదల కావాల్సిన ‘ఒరేయ్ బుజ్జిగా’ ఆ తర్వాత థియేటర్లు ఎప్పుడు ఓపెన్ అవుతాయా అని ఎదురు చూసి చూసి చివరికి ఓటీటీ రిలీజ్‌కు రెడీ అయిపోయింది.