రిలయన్స్ డిస్నీ ఇది మాములు డీల్ కాదు

ఓటిటి, శాటిలైట్ రంగంలో పెను విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతూ డిస్నీ రిలయన్స్ చేతులు కలపడం పట్ల ఇండస్ట్రీ వర్గాలు ఆసక్తిగా చూస్తున్నాయి. ఎందుకంటే ఇది ఆషామాషీ డీల్ కాదు. సుమారు 8.5 బిలియన్ డాలర్ల విలువకు ఈ ఒప్పందం జరిగిందని సమాచారం. ఈ కలయిక ద్వారా దేశవ్యాప్తంగా 750 మిలియన్ల వ్యూయర్స్ ని చేరుకోబోతున్నారు. రిలయన్స్ కు 16.3, వయాకామ్ 46.3, డిస్నీ 36.8 శాతంతో వాటాలు కలిగి ఉంటాయి. నీతా అంబానీకి చైర్ బాధ్యతలు అప్పజెప్పబోతున్నారు. ఉదయ్ శంకర్ వైస్ చైర్ మెన్ తో పాటు స్ట్రాటజిక్ అడ్వైజర్ గా ఉంటారు.

రాబోయే రోజుల్లో 40 శాతానికి పైగా మార్కెట్ షేర్ ని సొంతం చేసుకోవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా క్రీడలకు సంబంధించిన వ్యవహారాల్లో ఆరితేరిన రిలయన్స్ భాగస్వామ్యంతో రాబోయే రోజుల్లో పూర్తి ఆధిపత్యం చెలాయించవచ్చని లెక్కలు వేస్తున్నారు. ఇప్పటికే ఓటిటిల పరంగా విపరీతమైన పోటీ నెలకొంది. గతంలో ఎన్నడూ లేని విధంగా నెట్ ఫ్లిక్స్ దూసుకుపోతుండగా, ప్రైమ్ కొత్త ఎత్తుగడలతో సిద్ధమవుతోంది. సోనీ లివ్ లాంటివి ప్లాన్లు మారుస్తున్నాయి. ఆహా, ఈటీవీ విన్ తరహా ఓన్లీ తెలుగు యాప్స్ కు ఈ కాంపిటీషన్ ప్రణాళికలు మార్చుకునేలా చేస్తోంది.

థియేటర్ వినోదానికి సమాంతర ప్రత్యాన్మయంగా మారుతున్న ఓటిటిని మరింత బలోపేతం చేయడం ద్వారా ప్రేక్షకులను పెంచుకోవాలనేది రిలయన్స్, హాట్ స్టార్ ల సంయుక్త కార్యాచరణ. డిజిటల్ హక్కుల మార్కెట్ బాగా పడిపోయిందని దిగులు పడుతున్న నిర్మాతలకు ఇలాంటి పరిణామాలు సంతోషం కలిగించేవే. ఎందుకంటే పెద్ద స్టార్లవే కాకుండా మీడియం రేంజ్ హీరోల సినిమాలకూ నిర్మాణంలో ఉండగానే డిమాండ్ పెరుగుతుంది. వెబ్ సిరీస్ ల ద్వారా ఆర్టిస్టులకు అవకాశాలు పెరుగుతాయి. డైరెక్ట్ డిజిటల్ మూవీస్ ప్రొడక్షన్ ఊపందుకుంటుంది.