బాబాయ్ తేదీ మీద అబ్బాయ్ కన్ను

పవన్ కళ్యాణ్ ఓజి సెప్టెంబర్ 27 విడుదలవుతుందని నిర్మాతలు అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. డివివి దానయ్య ఇటీవలే ఓ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఎన్నికలు కాగానే పవన్ ఓ ఇరవై రోజులు కాల్ షీట్లు ఇస్తే షూటింగ్ మొత్తం పూర్తి చేస్తామని అనుకున్న డేట్ కే వస్తామని చెప్పడం వీడియోగానూ బయటికి వచ్చింది. అయితే ప్యాన్ ఇండియా సినిమాలు ఖచ్చితంగా మాట మీదే ఉండే పరిస్థితులు లేవని గత నాలుగైదు సంవత్సరాలుగా ఋజువవుతూనే ఉంది. అలాంటప్పుడు ఓజి మాత్రమే కట్టుబడి ఉంటుందని ఎలాంటి గ్యారెంటీ లేదు. అందుకే ప్లాన్ బి సిద్ధమవుతోందని ఇన్ సైడ్ టాక్.

దాని ప్రకారం ఒకవేళ ఓజి కనక తప్పుకునే సంకట స్థితి వస్తే దాని స్థానంలో గేమ్ ఛేంజర్ తేవాలనే ఆలోచనలో నిర్మాత దిల్ రాజు ఉన్నట్టు సమాచారం. ఎలాగూ ఇండియన్ 2 మేలో వస్తుందని చెన్నై వర్గాలు నొక్కి చెబుతున్నాయి కాబట్టి శంకర్ ఈ మార్పుకి పెద్దగా అభ్యంతరం చెప్పకపోవచ్చు. ఎందుకైనా మంచిది షూట్ కాగానే పోస్ట్ ప్రొడక్షన్ పనులు మరింత వేగంగా చేసి ఆగస్ట్ కల్లా ఫస్ట్ కాపీ సిద్ధం చేసుకునేలా కార్యాచరణ రూపొందిస్తున్నారని తెలిసింది. ఇదంత తేలిక కాదు. తమన్ రీ రికార్డింగ్, ఆడియో సాంగ్స్ లాంచ్, టీజర్ ట్రైలర్ ఈవెంట్లు ఇలా ముందస్తు ప్లానింగ్ బోలెడు అవసరం ఉంటుంది.

ప్రస్తుతానికి ఇది గాసిప్ గానే తిరుగుతోంది కానీ అనూహ్యంగా మారుతున్న పెద్ద సినిమాల ప్లానింగ్ లో ఏమైనా జరిగే అవకాశాన్ని కొట్టిపారేలేం. ఇప్పటికే గేమ్ ఛేంజర్ విపరీతంగా ఆలస్యమయ్యింది. ఒకవేళ సెప్టెంబరే బెస్ట్ ఆప్షన్ అనుకున్న తరుణంలో చరణ్ పర్సనల్ గా అడిగితే పవన్ నో చెప్పకపోవచ్చు. ఆర్ఆర్ఆర్ నిర్మాతగా దానయ్య కూడా ఆ రిక్వెస్ట్ పట్ల సానుకూలంగా ఉంటారు. ఫ్యాన్స్ కి ఏది వచ్చినా పండగే కానీ వీలైనంత త్వరగా కన్ఫర్మ్ చేసుకుంటే బెటర్. మార్చి 27 రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా టీజర్ ని విడుదల తేదీతో సహా వదలాలనేది టీమ్ ప్లాన్. చూద్దాం.