చనిపోయిన హీరోని విలన్‍ చేస్తున్నారా?

రియా చక్రవర్తి అరెస్ట్ నేపథ్యంలో ఆమెకి సపోర్ట్ గా సినిమా వాళ్ల గళాలు ఒక్కసారిగా పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. సుషాంత్‍ సింగ్‍ కోసం ఆమె డ్రగ్స్ పలుమార్లు కొన్నదని, కొందరితో కొనిపించిందని ఆమెపై ఎఫ్‍ఐఆర్‍లో నమోదైన ఆరోపణ. అందులో ఆమె డ్రగ్స్ తీసుకుందనే ప్రస్తావన ఎక్కడా లేదు. చనిపోయిన సుషాంత్‍ కోసమే ఆమె ఈ పని చేసినట్టు మాత్రం అందులో వుంది. దీంతో సుషాంత్‍ సింగ్‍ బ్రతికి వున్నట్టయితే ఈ కేసులో అతనే నిందితుడయ్యే వాడని, అతని కోసం ఆమె డ్రగ్స్ కొన్నప్పుడు ఆమెను ఎందుకు నిందితురాలిని చేస్తున్నారని బాలీవుడ్‍ ప్రముఖులు ఆమెకి సపోర్ట్ గా పోస్టులు పెడుతున్నారు.

దర్శకుడు అనురాగ్‍ కశ్యప్‍ అయితే ఒక అడుగు ముందుకు వేసి చనిపోయిన వ్యక్తి గురించి కొన్ని మాట్లాడకూడదు కాబట్టి ఇంతకాలం మౌనంగా వున్నామని, ఇప్పుడు నిజాలు బయటకు వస్తున్నాయి కనుక మాట్లాడక తప్పట్లేదని వ్యాఖ్యానించాడు. ఇలాంటి నర్మ గర్భ వ్యాఖ్యలు ఇంకా పలువురు బాలీవుడ్‍ ప్రముఖులు చేస్తున్నారు. వారి మాటలను బట్టి సుషాంత్‍ సింగ్‍ డ్రగ్‍ అడిక్ట్ అని బాలీవుడ్‍లో అందరికీ తెలుసుననే అర్థం వస్తోంది.

చనిపోయిన వాడు తనను తాను డిఫెండ్‍ చేసుకోలేడు కనుక అతడిని నిందితుడిగా చూపిస్తున్నారా అంటూ సుషాంత్‍ సోదరి బాలీవుడ్‍లో రియాకు సపోర్ట్ గా నిలబడిన వారిని నిలదీస్తోంది. ఆమె మాటలు కూడా నిజమే. ఒక వ్యక్తి ఇప్పుడు లేడు కనుక, డ్రగ్స్ కొన్నాను కానీ, అతని కోసమే అనేస్తూ వుండొచ్చుగా? డ్రగ్స్ అసలు తాను తీసుకోలేదని చెబుతోన్న రియా మాటలలో నిజమెంత? అది సుషాంత్‍ అయితే వచ్చి చెప్పలేడుగా? నోరెత్తుతున్న పెద్దలు దీనిని కూడా కన్సిడర్ చేయాలి మరి.