కరువు కాలమే 100 కోట్లు తెచ్చి పెట్టింది

ఇటీవలే విడుదలైన బాలీవుడ్ మూవీ తేరి బాతోమే ఐసా ఉల్జా జియాకు విశ్లేషకుల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. పబ్లిక్ టాక్ కూడా ఏమంత ఆశాజనకంగా లేదు. అయినా సరే ప్రేక్షకుల మద్దతు బాగానే దక్కింది. పది రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా వంద కోట్ల గ్రాస్ దాటేసి ఆశ్చర్యపరిచింది. షాహిద్ కపూర్, ఆదిపురుష్ సీత కృతి సనన్ జంటగా నటించిన ఈ రామ్ కామ్ ఎంటర్ టైనర్ లో నిజంగా గొప్పగా అనిపించే అంశాలు పెద్దగా లేవు. పైపెచ్చు బోర్ కొట్టించే కథనం సెకండ్ హాఫ్ లో చిరాకు పెడుతుంది. అయినా సరే ఇంత ఆదరణ దక్కడం అనూహ్యంగానే చెప్పాలి.

దీనికి కారణం ఒకటే. డంకీ నుంచి హిందీలో చెప్పుకోదగ్గ సినిమాలు రాలేదు. ఏది వచ్చినా కనీస స్థాయిలో మెప్పించలేక వారం తిరక్కుండానే తోక ముడిచేవి. ఇంకా నయం ఫైటర్ లేకపోతే పరిస్థితి ఇంకా దారుణంగా ఉండేది. అక్కడితో మొదలు ఒకరకమైన స్లంప్ నార్త్ ట్రేడ్ లో రాజ్యమేలుతోంది. దీంతో సహజంగానే మరీ యావరేజ్ గా ఉన్న తేరి బాతోమే ఐసా ఉల్జా జియా కాస్తా ఎడారిలో ఒయాసిస్సులా కనిపించింది. ఓవర్సీస్ లోనూ ఇదే తరహా సిచువేషన్ ఉండటం నిర్మాతలకు వరంగా మారింది. ఫైనల్ రన్ అయ్యేలోపు ఈజీగా నూటా యాభై కోట్లు వస్తాయని అంచనా.

హృతిక్ రోషన్ ఫైటర్ మీద మిశ్రమ స్పందన వచ్చినా అది కూడా స్టడీ రన్ అందుకుంది. నిర్మాతను నష్టాల నుంచి గట్టెక్కించింది. గత ఏడాది రాకీ ఔర్ రాణికి ప్రేమ్ కహాని సైతం ఎంత ట్రోలింగ్ కు గురైనా కలెక్షన్లలో దుమ్మురేపింది. రణ్వీర్ సింగ్ ఓవర్ యాక్షన్ మీద ఎన్ని కామెంట్లు వచ్చినా వసూళ్లు మాత్రం కొల్లగొట్టాడు. జర హట్కె జర బచ్కె సైతం ఇదే కోవలో డీసెంట్ సక్సెస్ అందుకుంది. అయినా పఠాన్, జవాన్ లాంటి ఊర మాస్ కంటెంట్ కోసం ఎదురు చూస్తున్న టైంలో ఏదో ఒకటి లెమ్మని ఆడియన్స్ సర్దుకుపోతున్న వైనం కనిపిస్తోంది. మార్చిలో యోధ వచ్చేదాకా ఇంతేనేమో.