జయప్రకాష్ రెడ్డి ‘ముక్కు’ కథ

ఒక వ్యక్తి ఉన్నప్పటి కంటే వెళ్లిపోయాక వాళ్ల విలువ ఎక్కువ తెలుస్తుందంటారు. మంగళవారం గుండెపోటుతో మృతిచెందిన నటుడు జయప్రకాష్ రెడ్డి విషయంలో ఇదే జరుగుతోంది. టాలీవుడ్లో ప్రముఖ నటుల గురించి చెప్పాల్సి వచ్చినపుడు జయప్రకాష్ రెడ్డి పేరు చాలామందికి గుర్తుకురాకపోవచ్చు.

కానీ ఆయన మరణించిన సందర్భంగా సినీ జనాలు, అభిమానుల స్పందన చూస్తే తనపై ఉన్న అభిమానం ఎంత అన్నది అర్థమవుతోంది. ఈ సందర్భంగా జయప్రకాష్ రెడ్డి సినీ ప్రయాణాన్ని అవలోకనం చేసుకుని, ఆయన చేసిన పాత్రల్ని గుర్తు తెచ్చుకుంటే ఎంత గొప్ప నటుడన్నది తెలుస్తోంది.

ముఖ్యంగా విలన్‌గా, కమెడియన్‌గా ఆయన చేసిన ఫ్యాక్షన్ పాత్రల గురించి ఎంత చెప్పినా తక్కువే. కెరీర్ ఆరంభంలో జయప్రకాష్ రెడ్డి చేసిన పాత్రలు చూస్తే నిజంగా ఆయన ఫ్యాక్షనిస్టేమో అనిపిస్తుంది కూడా. అంత బాగా ఆ పాత్రల్లో ఒదిగిపోయారు. ఆయన లుక్ కూడా అందుకు బాగా సెట్ అయింది.

గతంలో జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఓ యాంకర్ జయప్రకాష్ రెడ్డిని ఇదే విషయం అడిగింది. మీరు నిజంగా ఫ్యాక్షనిస్టా.. మీ ముక్కు మీద గాటు చూస్తే ఎవరో శత్రువులు దాడి చేసినట్లు అనిపిస్తోందే అని ప్రశ్నించింది. దీని వెనుక అసలు కారణమేంటో ఆ ఇంటర్వ్యూలో ఆయన వెల్లడించారు. తన అస్తవ్యస్తంగా కనిపించడానికి, ముక్కు మీద గాటు ఉండటానికి మధ్యలో ఆగిపోయిన ఒక సర్జరీనే కారణమని ఆయన తెలిపారు.

తనది కొంచెం చప్పిడి ముక్కు కావడంతో తనకు తెలిసిన ఓ ప్లాస్టిక్ సర్జర్ ద్వారా దాన్ని సరి చేయిస్తానని ఒకప్పుడు ఓ మిత్రుడు తనకు చెప్పినట్లు జయప్రకాష్ రెడ్డి గుర్తు చేసుకున్నారు. అతను బలవంతపెట్టడంతో సరే అన్నానని.. కేరళకు చెందిన పేరుమోసిన ఆ ప్లాస్టిక్ సర్జన్ తన ముక్కుకు సర్జరీ చేశాడని.. ఐతే ఒక సిట్టింగ్ తర్వాత ఆరు నెలలు గ్యాప్ తీసుకుని రెండో సిట్టింగ్ చేద్దామని అన్నాడని.. ఆ సమయంలో ముక్కు మీద చిన్న గ్యాప్ లాంటిది వచ్చిందని.. అది గాటు లాగా తయారైందని.. దాన్ని తర్వాతి సిట్టింగ్‌లో సరి చేస్తానని అతను చెప్పాడని.. ఐతే తాను కొంచెం ఆలస్యం చేశానని.. ఈ లోపు ఆ డాక్టర్ కారు ప్రమాదంలో మరణించాడని.. తనకు మరొకరితో ఆ సర్జరీ చేయించుకోవాలని అనిపించలేదని.. అలా వదిలేయడంతో ముక్కు తేడా కొట్టిందని.. దాని గురించి చాలామంది అడిగారని అసలు విషయం చెప్పారు జయప్రకాష్ రెడ్డి.