అనుష్క-క్రిష్.. క్రేజీ టైటిల్

తెలుగులో హీరోలతో సమానంగా స్టార్ ఇమేజ్ సంపాదించిన హీరోయిన్లలో అనుష్క శెట్టి ఒకరు. మొదట్లో అందరు హీరోయిన్లలో ఒకరిలా కనిపించిన అనుష్క.. ‘అరుంధతి’ దగ్గర్నుంచి తన రూటే సపరేటు అన్నట్లు సాగింది. ఆ తర్వాత బాహుబలి, రుద్రమదేవి, భాగమతి లాంటి సినిమాలు ఆమె ఇమేజ్‌ను ఎక్కడికో తీసుకెళ్లాయి.

ఐతే కొన్నేళ్ల నుంచి అనుష్క సినిమాకు సినిమాకు చాలా గ్యాప్ తీసుకుంటుండడం.. జనాల్లో పెద్దగా కనిపించకపోవడం అభిమానులకు నిరాశ కలిగిస్తోంది. ‘నిశ్శబ్దం’ తర్వాత అనుష్క ఇంకో సినిమా చేయడానికి దాదాపు నాలుగేళ్లు పట్టింది. గత ఏడాది ఆమె నుంచి వచ్చిన ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ మంచి విజయం సాధించడంతో ఆమెలో మళ్లీ ఉత్సాహం వచ్చినట్లుంది.

ఈసారి ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా సినిమా చేసేస్తోంది అనుష్క. ‘వేదం’ తర్వాత ఆమె మళ్లీ క్రిష్ దర్శకత్వంలో సినిమాకు రెడీ అయిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ఒక క్రేజీ టైటిల్ ఖరారు చేసినట్లు సమాచారం. ఆ టైటిలే.. శీలావతి. ఈ పేరుతో ఒక చేప ఉందన్న సంగతి తెలిసిందే. కానీ మామూలుగా చూస్తే అమ్మాయి శీలాన్ని సూచించే సెటైరికల్ టైటిల్ లాగా అనిపిస్తుంది.

ఎవరి అభిప్రాయాలు ఎలా ఉన్నా.. ఈ టైటిల్ చాలా క్యాచీగా ఉండి వెంటనే పాపులర్ అయిపోతుందనడంలో సందేహం లేదు. ఇది ఒక లేడీ ఓరియెంటెడ్ కథతో తెరకెక్కనున్న సినిమా అంటున్నారు. తమిళ నటుడు విక్రమ్ ప్రభు ఇందులో అనుష్కకు జోడీగా నటిస్తున్నాడు. అనుష్క మాతృ సంస్థ అనదగ్గ యువి క్రియేషన్స్ బేనర్లో ఈ చిత్రం తెరకెక్కనుంది.