నిర్మాత మాటల్లో లాజిక్స్ ఉన్నాయి

ఎంత కళతో ముడిపడినదే అయినా సినిమా అనేది వ్యాపారం. పెట్టుబడి పెట్టిన ప్రతిఒక్కరు లాభాల కోసమే ఇండస్ట్రీకి వస్తారు. కానీ ప్రతిసారి సానుకూల ఫలితం ఉండదు. రిస్క్ కు సిద్ధపడే రావాలి. ఏదైనా తేడా వస్తే దాన్ని భరించే శక్తి ఉంటే తప్ప ఇక్కడ నిలదొక్కుకోవడం కష్టం. రెండు కోట్లు పెట్టింది ఇరవై కోట్లు తేవొచ్చు. ఎనభై కోట్లు పెడితే పది కోట్లు వచ్చి నిండా మునగొచ్చు. దేనికీ గ్యారెంటీ లేదు. నిర్మాత అనిల్ సుంకర ఈ విషయంలో చెబుతున్న విషయాలు చాలా స్పష్టంగా, డిస్ట్రిబ్యూటర్లు ప్రొడ్యూసర్ల కోణంలో ఆలోచించేలా, అర్ధవంతంగా ఉన్నాయి.

ఊరుపేరు భైరవకోనను ఆపాలంటూ ఓ పంపిణీదారుడు ఏజెంట్ నష్టాలను ఉటంకిస్తూ కేసు ద్వారా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయడం తెలిసిందే. దీని వల్ల రిలీజ్ ఆగుతుందనే ప్రచారం జరిగింది. అయితే రెండిటికీ సంబంధం లేదని వివరణ ఇస్తూ నిర్మాణ సంస్థ సహేతుకమైన సమాధానం చెప్పడంతో వివాదం ముగిసింది. థియేట్రికల్ రిలీజ్ సందర్భంగా జరిగిన ప్రెస్ మీట్ లో అనిల్ సుంకర ఈ ప్రస్తావన వచ్చినపుడు రిస్కుకి సిద్ధపడే అందరూ బిజినెస్ చేస్తారని, నష్టం వచ్చినప్పుడు కేసులు వేయడం, లాభం వచ్చినప్పుడు నాకే కావాలని కోరుకోవడం తప్పని అన్నారు.

నేనింతేలో రవితేజ అన్నట్టు వచ్చినా పోయినా సినిమాలే ప్రపంచంగా బ్రతికే తనలాంటి వాళ్ళు ఎన్నో తట్టుకునే ఇక్కడ నిలబడతారని అన్నారు. తనను కష్టపెట్టొచ్చేమో కానీ బెదిరించలేరని చిన్న స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. వ్యక్తిగతంగా తనకు ఎవరి మీద కోపం లేదని, ఏదో ఆవేశంలో ఇబ్బంది పెట్టినా పెద్దగా పట్టించుకోనని తేల్చి చెప్పారు. ఊరుపేరు భైరవకోన మీద చాలా కాన్ఫిడెంట్ గా ఉన్న అనిల్ సుంకర ఈ సినిమాకు సమర్పకుడిగా వ్యవహరించగా రాజేష్ దండ నిర్మాత. సామజవరగమన ఇదే కలయికలో బ్లాక్ బస్టరైన సంగతి తెలిసిందే. ఈసారి అదే ఫలితం వస్తుందేమో చూడాలి.