తెలుగు సినిమా ఓ గొప్ప నటుడిని కోల్పోయింది. చేసిన ప్రతి పాత్రలో ప్రత్యేకతను చాటుకున్న జయప్రకాష్ రెడ్డి గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. తెరపై ఆయన వేసిన పాత్రల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇటు విలన్గా, అటు కమెడియన్గా ఒకే స్థాయిలో మెప్పించడం అరుదైన విషయం. నాటక రంగంలో కూడా జయప్రకాష్ రెడ్డికి గొప్ప పేరుంది.
ఆయన సినిమాల్లోకి రాకముందు, ఆ తర్వాత కూడా నాటకాల్లో మెరిశారు. ఆ రంగంలో జయప్రకాష్ రెడ్డి పేరెత్తగానే గుర్తుకొచ్చే నాటకం.. అలెగ్జాండర్. జయప్రకాష్ రెడ్డి ఎంతో ముచ్చటపడి రాయించుకుని నటించిన నాటకం ఇది. దీన్ని సినిమా రూపంలోకి కూడా తేవాలని, ప్రేక్షకులకు చూపించాలని ఆయన తపించారు. కానీ ఆ కల సగంలోనే ఆగిపోయింది.
చాలా ఏళ్ల కిందటే ప్రముఖ దర్శకుడు ధవళ సత్యం సహాయంతో ‘అలెగ్జాండర్’ చిత్రాన్ని తెర మీదకు తీసుకొచ్చారు జయప్రకాష్ రెడ్డి. 100 నిమిషాల నిడివి ఉన్న ఈ నాటకంలో జయప్రకాష్ రెడ్డి ఒక్కరే తెరపై కనిపిస్తారు. ఆయనతో ఫోన్లో మాట్లాడే పాత్రలుగా కోట శ్రీనివాసరావు, అల్లరి నరేష్, కొండవలస, రావి కొండలరావు, సాయికుమార్, తెలంగాణ శకుంతల, రఘుబాబు లాంటి వాళ్లు గాత్రాన్ని అందించారు.
ఐతే సినిమా పూర్తి చేశారు కానీ.. అది విడుదలకు నోచుకోలేదు. దీని విడుదల కోసం ఎంతో ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఆ కథలో తను చెప్పదలుచుకున్న సందేశాన్ని చూసేందుకు అయినా… ప్రేక్షకులు ఈ సినిమాని ఆదరించాలి అంటూ ఆయన కొన్ని సందర్భాల్లో తన కోరికను వెల్లడించారు. థియేటర్లలో రిలీజ్ చేస్తే ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపరని.. కనీసం ఓటీటీ ద్వారా అయినా ఈ చిత్రాన్ని ప్రేక్షకులకు చేరువ చేయాలని అనుకున్నారు. ఈ దిశగా ప్రయత్నాలు చేస్తున్న సమయంలో గుండెపోటులో హఠాత్తుగా కన్నుమూశారు. అలా ఆయన కల తీరకుండానే మిగిలిపోయింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates