ఈ మధ్య కాలంలో మలయాళం సినిమాల మీద మన జనాలకు అంతగా ఆసక్తి కలగడం లేదు. అక్కడ ఫలితం తేలాక డబ్బింగ్ చేయడం చేయకపోవడం ఏమో కానీ అసలు సమాంతర రిలీజులు సాధ్యం కావడం లేదు. ఇటీవలే మోహన్ లాల్ మలైకోట్టై వాలిబన్ కేరళలో దారుణమైన డిజాస్టర్ మూటగట్టుకున్నాక అనువాద వర్షన్ ని అటక ఎక్కించేశారు. ఎల్లుండి భ్రమ యుగం రిలీజ్ కాబోతోంది. ఇటీవలే తెలుగుతో సహా అన్ని ప్రధాన భాషల్లో ట్రైలర్ రిలీజ్ చేశారు. మమ్ముట్టి కెరీర్ లో మొదటిసారి చాలా ఇంటెన్స్ క్యారెక్టర్ చేసినట్టు విజువల్స్ చూస్తే అర్థమైపోయింది. ఇది బ్లాక్ అండ్ వైట్ మూవీ.
ఒక వర్గం మూవీ లవర్స్ కు దీని మీద ప్రత్యేక అంచనాలున్నాయి. అయితే తెలుగు వెర్షన్ అదే రోజు విడుదల చేయడం లేదు. ఊరిపేరు భైరవకోన తప్ప చెప్పుకోదగ్గ కొత్త సినిమాలు ఈ వారం లేనప్పటికీ భ్రమ యుగం నిర్మాతలు రిస్క్ తీసుకోవడం లేదు. కారణాలు లేకపోలేదు. ప్రమోషన్లకు టైం సరిపోలేదు. జానర్ దృష్ట్యా బయ్యర్లను ఇంకా కుదుర్చుకోలేదు. చాలా కాలంగా మమ్ముట్టికి ఏపీ తెలంగాణలో కనీస ఓపెనింగ్స్ రావడం లేదు. పబ్లిసిటీ ఖర్చులు గిట్టుబాటు కానంత దారుణంగా ఫ్లాపులున్నాయి. అందుకే మలయాళంలో పెద్ద హిట్ అయినవి కూడా తెలుగులో ఓటిటికి పరిమితం చేశారు.
సో భ్రమ యుగం అక్కడ హిట్ అయితేనే మన దగ్గరకు త్వరగా వస్తుంది. నలుపు తెలుగు రంగుల్లో సినిమా తీయడం ఎప్పుడో నలభై ఏళ్ళ క్రితమే ఆగిపోయింది. మళ్ళీ ఈ ట్రెండ్ ని మమ్ముట్టి లాంటి స్టార్ హీరో చేయడంతో ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నారు. ఆ మధ్య గ్రే అనే చిన్న సినిమా ఒకటి తెలుగులో స్ట్రెయిట్ గానే వచ్చింది కానీ ఎవరూ పట్టించుకోలేదు. భ్రమ యుగంలో హీరో విలన్ అంటూ ఎవరూ ఉండరు. దెయ్యాలు భూతాల ప్రపంచంలో ఒక సాంప్రదాయ కుటుంబం ఎలా ప్రవేశించిందనే పాయింట్ తో దీన్ని రూపొందించారు. మమ్ముట్టి గెటప్ కూడా భయపెట్టేలా ఉంది.