ఈగల్ ఎగిరినట్లే ఎగిరి..

రవితేజ కెరీర్లోనే హైయెస్ట్ బడ్జెట్లో తెరకెక్కిన చిత్రం.. ఈగల్. ప్రస్తుతం టాలీవుడ్లో సినిమాల సంఖ్య, రేంజ్ పరంగా మిగతా బేనర్లన్నింటినీ దాటి ముందుకు వెళ్లిపోతున్న పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేసింది. ఇదే సంస్థలో రవితేజ నటించిన ‘ధమాకా’ బ్లాక్‌బస్టర్ కావడంతో ‘ఈగల్’పై భారీ బడ్జెట్ పెట్టారు. సంక్రాంతికి రిలీజ్ చేయాలనుకున్న ఈ చిత్రాన్ని అనివార్య పరిస్థితుల్లో ఫిబ్రవరి 9కి వాయిదా వేశారు. ఆ రోజు మంచి అంచనాల మధ్య విడుదలైన మాస్ రాజా సినిమాకు ఆశించిన టాక్ రాలేదు.

కథ కొంచెం భిన్నమైంది. యాక్షన్ ఘట్టాలు అద్భుతంగా తీశారు. ఓవరాల్ టేకింగ్ బాగుంది. రవితేజ పెర్ఫామెన్స్ ఓకే. కానీ ఓవరాల్‌గా సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. యావరేజ్ టాక్‌తో మొదలైన ఈ సినిమా వీకెండ్ వరకు బాగానే నిలబడింది.

తొలి రోజు ఉదయం డల్లుగా కనిపించిన ఈగల్ థియేటర్లు ఈవెనింగ్ షోలకు పుంజుకున్నాయి. తర్వాతి రెండు రోజుల్లో కూడా ఈవెనింగ్, నైట్ షోలకు మంచి ఆక్యుపెన్సీ కనిపించింది. డివైడ్ టాక్‌ను తట్టుకుని సినిమా బాగానే నిలబడుతోందని అనుకున్నారు. కానీ వీకెండ్ తర్వాత ‘ఈగల్’ జోరు కనిపించడం లేదు. సోమవారం వసూళ్లు డ్రాప్ అయ్యాయి. మంగళవారం కూడా ఆక్యుపెన్సీలు అంతంతమాత్రంగానే ఉన్నాయి.

ప్రేక్షకుల ఫోకస్ ఆల్రెడీ ఈ వీకెండ్ మూవీ ‘ఊరు పేరు భైరవకోన’ మీదికి మళ్లినట్లు కనిపిస్తోంది. ఆ సినిమాకు బుధవారమే పెయిడ్ ప్రిమియర్స్ పడుతున్నాయి. ఆ షోలకు వస్తున్న స్పందనతో పోలిస్తే.. ఈగల్ మీద ప్రేక్షకుల్లో ఇంట్రెస్ట్ తక్కువగానే కనిపిస్తోంది. గత ఏఢాది రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు చిత్రాలతో దెబ్బ తిన్న రవితేజ ఖాతాలో ‘ఈగల్’ మరో ఫ్లాప్‌గా నిలిచేలాగే కనిపిస్తోంది.