షాక్: మనసు మమత ‘శ్రావణి’ సూసైడ్

Tv Actress Sravani

షాకింగ్ ఉదంతం ఒకటి చోటు చేసుకుంది. బుల్లితెర నటి ఒకరు హైదరాబాద్ లోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్న వైనం.. మంగళవారం అర్థరాత్రి దాటిన తర్వాత చోటు చేసుకుంది. మనసు మమత.. మౌనరాగం తదితర సీరియల్స్ లో నటించి.. ప్రజాదరణ పొందిన శ్రావణి ఆత్మహత్య ఉదంతం ఇప్పుడు సంచలనంగా మారింది.

హైదరాబాద్ లోని ఎస్ ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మధుర నగర్ హెచ్56 బ్లాక్ రెండో ఫ్లోర్ లో ఆమె నివసిస్తున్నారు. మంగళవారం రాత్రి సమయంలో బాత్రూంలోకి వెళ్లిన ఆమె.. ఎంత సేపటికి తిరిగి రాకపోవటంతో.. ఆమె కుటుంబ సభ్యులు అనుమానపడ్డారు.

ఎంతసేపు తలుపు తట్టినా స్పందించకపోవటంతో బాత్రూం తలుపును పగలగొట్టారు. అప్పటికే ఆమె బాత్రూంలో ఊరి వేసుకున్న విషయాన్ని గుర్తించారు.

వెంటనే ఆమెను తీసుకొని యశోద ఆసుపత్రికి వెళ్లారు. అయితే.. అప్పటికే ఆమె మరణించిందని వైద్యులు నిర్దారించారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలానికి.. ఆసుపత్రికి వెళ్లారు.

ఆత్మహత్యకు కారణం ఏమై ఉంటుందన్న కోణంలో పోలీసులు విచారణ షురూ చేశారు. దాదాపు ఎనిమిదేళ్ల నుంచి తెలుగు టీవీ సీరియల్స్ లో ఆమె నటిస్తున్నారు. పాపులర్ నటిగా సుపరిచితమైన ఆమె ఆత్మహత్య సంచలనంగా మారింది.