ట్రూ లవర్ ఎలా ఉన్నాడు

బేబీ నిర్మాతలు ఎస్కెఎన్, మారుతీలు సంయుక్తంగా కొన్న డబ్బింగ్ సినిమా ట్రూ లవర్ మీద యూత్ లో అంచనాలు బాగానే ఉన్నాయి. ఖచ్చితంగా ఆడుతుందనే నమ్మకంతో ముందు రోజు రాత్రే ప్రీమియర్లు వేశారు. రవితేజ ఈగల్ కు సోలో డేట్ దక్కడం కోసం తమిళ వెర్షన్ కన్నా ఒక రోజు ఆలస్యంగా ట్రూ లవర్ థియేటర్లలో అడుగు పెట్టాడు. ప్రభురాం వ్యాస్ దర్శకత్వం వహించగా సీస్ రోల్డాన్ సంగీతం సమకూర్చారు. తెలుగమ్మాయి శ్రీ గౌరీప్రియా హీరోయిన్ గా నటించడం విశేషం. అంతా తమిళ మొహాలే అయినా కంటెంట్ బాగుంటే అదేమీ మైనస్ కాదు కాబట్టి బొమ్మ ఎలా ఉందో చూద్దాం

కాలేజీలోనే ప్రేమించుకున్న అరుణ్(మణికందన్), దివ్య(శ్రీ గౌరీప్రియ)లు చదువు పూర్తయ్యాక ఆ అమ్మాయికి సాఫ్ట్ వేర్ ఉద్యోగం వస్తుంది. అరుణ్ మాత్రం కేఫ్ పెట్టి స్వంతంగా బిజినెస్ పెట్టాలని చూస్తుంటాడు. అతనికి విపరీతమైన అనుమానం, అభ్రతాభావం. దీని వల్ల తరచూ ఇద్దరి మధ్య గొడవలు పడి విడిపోతారు. అరుణ్ తల్లి వల్ల మళ్ళీ కలుసుకునే సందర్భంగా వస్తుంది. కొద్దిరోజులయ్యాక దివ్య బర్త్ డే పార్టీలో రేగిన దుమారం వల్ల కథ మళ్ళీ మొదటికే వస్తుంది. ఫ్రెండ్స్ తో కలిసి ట్రిప్ కు వెళ్లిన దివ్యకు చెప్పకుండా అరుణ్ అక్కడికి వెళ్తాడు. తర్వాత ఏమైందనేది తెరమీద చూడాల్సిన కథ.

స్టోరీపరంగా చాలా చిన్న లైన్ ఇది. నిజ జీవితంలో ప్రేమ జంటల మధ్య ఉండే సహజమైన ఎమోషన్స్ ని ట్రూ లవర్ లో చూపించే ప్రయత్నం చేశాడు ప్రభురాం వ్యాస్. ఫ్రెష్ గా మొదలుపెట్టిన నెరేషన్ సెకండ్ హాఫ్ కు వచ్చేటప్పటికీ రిపీట్ అనిపించే సన్నివేశాలతో ముందుకు కదలక సతమతమవుతుంది. యూత్ కి కనెక్ట్ అయ్యే అంశాలు ఉన్నప్పటికీ పూర్తిగా ఎంగేజ్ చేసే కంటెంట్ లేకపోవడంతో సాధారణ ప్రేక్షకులకు విసుగనిపించే ఎపిసోడ్స్ ఉన్నాయి. ఆర్టిస్టుల పరంగా లోపాలు లేవు కానీ రియల్ లైఫ్ లో ఇలాంటి ప్రేమను అనుభవిస్తే తప్ప ట్రూ లవర్ బాధని సగటు ఆడియన్స్ పూర్తిగా అర్థం చేసుకోవడం కష్టమే.