మీనాక్షి చౌదరి మీద కారం ఎఫెక్ట్ లేదు

బంగారపు హుండీని చిల్లర కోసం వాడుకున్నారని రాఖీ భాయ్ ని ఉద్దేశించి కెజిఎఫ్ లో చెప్పిన ఒక డైలాగు బాగా పాపులర్. గుంటూరు కారంలో మీనాక్షి చౌదరి పాత్రని తీర్చిదిద్దిన విధానం చూశాక అభిమానులకు కలిగిన అభిప్రాయం కూడా అదే. కేవలం ఆమ్లెట్ వేసి జయరాం, మహేష్ బాబుకి తెచ్చివ్వడం తప్ప ఆమె సినిమా మొత్తంలో ఏం చేసిందంటే సమాధానం చెప్పడం కష్టం. బ్లాక్ బస్టర్ అయ్యుంటే ఏమో కానీ ఫలితం ఆ స్థాయిలో రాకపోవడంతో శ్రీలీలకు దక్కిన ప్రయోజనమే ఏమీ లేదు. కానీ మీనాక్షి చౌదరికి ఈ రిజల్ట్ వల్ల ఎలాంటి బెంగ లేదు.

ప్రస్తుతం తన చేతిలో క్రేజీ ప్రాజెక్టులున్నాయి. విజయ్ పొలిటికల్ ఎంట్రీ ప్రకటించాక ‘ది గ్రేటెస్ట్ అఫ్ ఆల్ టైం’ మీద అంచనాలు రెట్టింపయ్యాయి. ఇందులో మీనాక్షినే హీరోయిన్. వరుణ్ తేజ్ మట్కా, విశ్వక్ సేన్ 10, దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్ ఆల్రెడీ సెట్ల మీద ఉన్నాయి. తాజాగా చిరంజీవి ‘విశ్వంభర’లోనూ దేవకన్యగా ఆఫర్ వచ్చిందని టాక్. అయితే ఎంత వరకు నిజమో ఇంకా తెలియాల్సి ఉంది. త్రిష కాకుండా ఇంకో ముగ్గురు కథానాయికలు ఈ ప్యాన్ ఇండియా మూవీకి అవసరం. పాత్రకున్న ప్రాధాన్యం దృష్ట్యా మీనాక్షి చౌదరి ఒప్పుకునే ఛాన్స్ ఎక్కువగా ఉందని వినికిడి.

ఈ లెక్కన గుంటూరు కారం తాలూకు ఎఫెక్ట్ తన మీద ఎంత మాత్రం లేదని అర్థమవుతోందిగా. మహేష్, పవన్, ప్రభాస్ రేంజ్ హీరోలతో సోలో ఆఫర్ కోసం ఎదురు చూస్తున్న ఈ అమ్మడికి త్వరలో ఆ కోరిక నెరవేరినా ఆశ్చర్యం లేదు. చిన్న సినిమాలతో మొదలుపెట్టి విజయ్ ఆంటోనీ హత్య లాంటి వాటిలో ప్రాధాన్యం లేని క్యారెక్టర్లు చేసిన స్టేజి నుంచి ఇంత బిజీగా మారే దాకా రావడం విశేషమే. టాలీవుడ్ లో శ్రీలీల డిమాండ్ క్రమంగా తగ్గుతోందనే కామెంట్స్ వినిపిస్తున్న నేపథ్యంలో రష్మిక మందన్నకు ధీటుగా ఎదిగేందుకు మీనాక్షికి ఇంతకన్నా ఛాన్స్ దొరకదు. రెండు హిట్లు పడటం ఆలస్యం అంతే.