బాలనటుడిగా కొన్ని సినిమాల్లో మంచి పేరు సంపాదించి.. ఆపై ‘నచ్చావులే’ సినిమాతో హీరోగా అరంగేట్రం చేసి మంచి విజయాన్నందుకున్నాడు తనీష్ అల్లాడి. కానీ ఆ తర్వాత అతను నటించిన సినిమాలేవీ ఆశించిన ఫలితాలివ్వలేదు. ‘రైడ్’ ఒక్కటి కొంచెం పర్వాలేదనిపించింది. వరుస ఫ్లాపులతో పూర్తిగా మార్కెట్ కోల్పోయి అడ్రస్ లేకుండా పోయాడు. ‘నక్షత్రం’లో నెగెటివ్ రోల్ చేస్తే అదీ ఫలితాన్నివ్వలేదు. అందరూ మరిచిపోయిన టైంలో ‘బిగ్ బాస్’ రెండో సీజన్లో పార్టిసిపెంట్‌గా వెళ్లి మళ్లీ జనాల దృష్టిలో పడ్డాడు. ఆ పాపులారిటీతో ‘రంగు’ సహా ఒకట్రెండు సినిమాల్లో నటించాడు కానీ.. అవి వచ్చింది వెళ్లింది కూడా తెలియదు. అయినా ప్రయత్నం ఆపకుండా ఇప్పుడు ‘మహాప్రస్థానం’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావాలని చూస్తున్నాడు తనీష్.
సెప్టెంబరు 7న తనీష్ పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్ర టీజర్ రిలీజైంది. ఈ సినిమా కోసం చిత్ర బృందం ఓ ప్రయోగం చేసింది. అలాంటి ప్రయోగం ఇప్పటిదాకా ఇండియన్ సినిమాలోనే జరగలేదట. ఇండియాలో తొలి ఫీచర్ ఫిలిం ‘రాజా హరిశ్చంద్ర’ అయితే.. తొలి టాకీ మూవీ ‘ఆలం ఆరా’.. తొలి 70 ఎంఎం మూవీ ‘షోలే’ అని చూపించి.. ఇప్పుడు సింగిల్ షాట్లో పూర్తయిన తొలి ఇండియన్ మూవీ ‘మహాప్రస్థానం’యే అని టీజర్లో చూపించారు. ఇంతకుముందు ‘ఫలక్‌నుమా దాస్’లో విశ్వక్సేన్.. 20 నిమిషాలక పైగా సాగే క్లైమాక్స్ మొత్తాన్ని సింగిల్ షాట్లో తీసి ఆకట్టుకున్నాడు. ఇప్పుడు మొత్తం సినిమానే సింగిల్ షాట్లో తీయడం అంటే విశేషమే. కానీ ఇలా సినిమా మొత్తం ఒకే షాట్లో కంటిన్యూ అయితే ప్రేక్షకులకు విసుగెత్తే అవకాశమూ ఉంది. ఎంతో ఆసక్తికరంగా ఉంటే తప్ప అది వర్కవుట్ కాదు. టీజర్లో విషయం చూస్తే ఏమంత ఆసక్తికరంగా కనిపించలేదు. పూర్తిగా వయొలెన్స్‌తో ముడిపడ్డ థ్రిల్లర్ లాగా అనిపిస్తోంది. జానీ అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించాడు.