ఆర్ఆర్ఆర్ నిర్మాతకు జాక్ పాట్ వర్షం

ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో ఉంటూ సూపర్ హిట్లు, బ్లాక్ బస్టర్లు ఇచ్చినప్పటికీ ఇతర బాషల హీరోలకు సైతం నిర్మాత డివివి దానయ్య గురించి తెలిసొచ్చింది ఆర్ఆర్ఆర్ వల్లే. సౌమ్యంగా, ఎక్కువ కనిపించకుండా తన పని తాను చేసుకుంటూ పోయే రీతిలో ఉండే ఈ అగ్ర నిర్మాతకు వందల కోట్ల పెట్టుబడికి తగ్గట్టు క్రేజీ ప్రాజెక్టులు కనక వర్షం కురిపించేలా ఉన్నాయి. ఇవాళ తమిళ స్టార్ హీరో విజయ్ రాజకీయ పార్టీ పెట్టేసి అఫీషియల్ ప్రెస్ నోట్ ఇచ్చాడు. గోట్ కాకుండా ఇంకొక్క సినిమా మాత్రమే చేస్తానని చెప్పడం చూశాం. ఆ ఒక్కటి నిర్మాత దానయ్యకేనని గత రెండు రోజులుగా హోరెత్తిపోతున్న వార్త.

దీన్ని మూడు రోజుల క్రితం మేం బ్రేక్ చేసిన సంగతి తెలిసిందే. డివివి సంస్థ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు కానీ ప్రాజెక్టు కన్ఫర్మ్ అని చెన్నై వర్గాల్లోనూ వినిపిస్తోంది. ఈ ఏడాదే చివరిలోపే షూటింగ్ పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నారట. దర్శకుడిగా కార్తీక్ సుబ్బరాజ్ లేదా హెచ్ వినోత్ ఇద్దరిలో ఒకరికి ఛాన్స్ ఉందట. పొలిటికల్ ఎంట్రీకి ముందు చివరి సినిమా కాబట్టి తమిళ ఆడియన్స్ దీన్ని వెర్రెత్తినట్టు చూస్తారు. బాగుంటే మాత్రం రికార్డులన్నింటికీ ఉప్పుపాతరే. వారసుడు లాంటి రొటీన్ కంటెంటే దిల్ రాజుకు కలెక్షన్ల వర్షం కురిపించినప్పుడు ఇక లాస్ట్ మూవీ గురించి చెప్పాలా.

దీని సంగతి కాసేపు పక్కనపెడితే పవన్ కళ్యాణ్ ఓజి, నాని సరిపోలేదా శనివారం రెండూ విపరీతమైన క్రేజ్ తో దానయ్యకు థియేట్రికల్ ప్లస్ డిజిటల్ రెండు హక్కులకు భారీ డిమాండ్ తెచ్చిపెడుతోంది. ఆల్రెడీ డీల్స్ ముగించేస్తున్నారు. ఎంత లేదన్నా ఈ రెండు సినిమాల మీద మూడు వందల కోట్లకు పైగా బిజినెస్ జరిగేలా ఉంది. ఒకవేళ విజయ్ ది త్వరగా అనౌన్స్ మెంట్ ఇచ్చేస్తే తమిళ డిస్ట్రిబ్యూటర్లు హైదరాబాద్ ఆఫీస్ కు వచ్చి మరీ క్యూ కడతారు. కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే సిరిలక్ష్మి అంటే ఇదేనేమో. దానయ్య టీమ్ మాత్రం ఇంకా ఈ ప్రచారం గురించి స్పందించాల్సి ఉంది.