రామ్ గోపాల్ వర్మకు ఎప్పుడు చూసినా ఎవరో ఒకరిని కెలకడం అలవాటు. అవతలి వాళ్లను ఇరుకున పెట్టేలా మాట్లాడి వాళ్లు రెచ్చిపోతుంటే కూల్‌గా ఆ తంతును ఆస్వాదించడం వర్మకు మహదానందం కలిగిస్తుంది. అవతలి వాళ్లు బూతులు తిడుతుంటే వర్మ మాత్రం ఏమాత్రం సహనం కోల్పోకుండా కూల్‌గా కౌంటర్లు వేస్తూ ఆస్వాదిస్తుంటాడు.
అలాంటి వర్మ ఇప్పుడు ఒక వ్యక్తిని చూసి తీవ్ర అసహనానికి గురవుతున్నాడు. పట్టరాని కోపం తెచ్చుకుని ఊగిపోతున్నాడు. అవతలి వ్యక్తిని ఎవరైనా దెబ్బ కొడితే చూడాలని తహతహలాడిపోతున్నాడు. ఆ దిశగా కొందరిని ఉసిగొల్పే ప్రయత్నం అవిశ్రాంతంగా చేస్తున్నాడు.
కానీ వర్మ టార్గెట్ చేస్తున్న వ్యక్తి కానీ.. అతడి మీదికి వర్మ ఉసిగొల్పాలని చూస్తున్న వ్యక్తులు కానీ వర్మను అస్సలు పట్టించుకోవడం లేదు పాపం. అంతగా తన విలువను దిగజార్చుకున్నాడు ఒకప్పటి మన లెజెండరీ డైరెక్టర్.
ఇంతకీ విషయం ఏంటంటే.. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అనుమానాస్పద మృతికి సంబంధించి మీడియాలో విస్తృతమైన కవరేజీ, చర్చా కార్యక్రమాలతో వార్తల్లో నిలుస్తున్నాడు రిపబ్లిక్ టీవీ అధినేత అర్నాబ్ గోస్వామి. బాలీవుడ్ మూవీ మాఫియా మీద అతను యుద్ధం ప్రకటించి.. సుశాంత్ మృతికి వాళ్లే కారణం అని అతను తీవ్ర ఆరోపణలు చేస్తున్నాడు.
టీవీ చర్చల్లో తీవ్ర ఆగ్రహాకావేశాలతో బాలీవుడ్ వాళ్లను టార్గెట్ చేస్తున్నాడు. అలాగే మహారాష్ట్రలో అధికారంలో ఉన్న శివసేన సర్కారును, ముంబయి పోలీసులను అతను సవాలు చేస్తున్నాడు. సుశాంత్ మృతికి అతడి మాజీ ప్రేయసి రియానే కారణమని.. ఆమెను లోకల్ పోలీసులు కాపాడే ప్రయత్నం చేస్తున్నారని అతను ఆరోపణలు చేస్తున్నాడు.
ఈ వ్యవహారం వర్మకు అస్సలు నచ్చట్లేదు. తనకు నచ్చని వ్యక్తుల మీద ఈజీగా సినిమాలు అనౌన్స్ చేసేయడం వర్మకు అలవాటు. అర్నాబ్ మీద కూడా అలాగే సినిమా ప్రకటించాడు. కొన్ని రోజులుగా అర్నాబ్‌ను ట్విట్టర్ ద్వారా దునుమాడే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఎవరూ పట్టించుకోవట్లేదు. తాజాగా శివసేన సర్కారును, ముంబయి పోలీసులను రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. మీకు దమ్ము లేదా అన్నట్లుగా మాట్లాడాడు. అయినా సరే.. అటు నుంచి స్పందన లేదు. ఇక అర్నాబ్ సంగతి సరేసరి. వర్మ ఉనికినే గుర్తించట్లేదు. కానీ మన వర్మ మాత్రం తన పోరాటాన్ని ఆపట్లేదు. అసహనాన్ని దాచుకోవట్లేదు. ఎప్పుడూ అవతలి వాళ్లను గిల్లి వినోదం చూసే వర్మను ఇలా ఫ్రస్టేట్ చేస్తున్నాడంటే అర్నాబ్ మొనగాడే కదా.
Gulte Telugu Telugu Political and Movie News Updates