తండేల్ శ్రద్ధ తీసుకోవాల్సింది ఈ పాయింటే

లవ్ స్టోరీ సూపర్ హిట్ తర్వాత రిపీటవుతున్న నాగ చైతన్య-సాయి పల్లవి కాంబినేషన్ లో రూపొందుతున్న తండేల్ షూటింగ్ మంచి ఫ్లోలో ఉంది. ఇటీవలే రిలీజైన టీజర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది. తీసిన కొద్దిభాగం నుంచే ఆ మాత్రం విజువల్స్ కట్ చేయడం దర్శకుడు చందూ మొండేటి ప్రతిభకు నిదర్శనంగా చెప్పొచ్చు. పైకి చెప్పడం లేదు కానీ గీతా ఆర్ట్స్ బ్యానర్ పై రూపొందుతున్న తండేల్ మీద సుమారు వంద కోట్ల దాకా బడ్జెట్ అవ్వొచ్చనే టాక్ వినిపిస్తోంది. థియేట్రికల్ బిజినెస్ కోణంలో ఆలోచించకుండా కంటెంట్ మీద నమ్మకంతో ఖర్చుకి సిద్ధపడుతున్నారు.

ఇదంతా బాగానే ఉంది కానీ తండేల్ ప్యాన్ ఇండియా మూవీ కావడంతో ఒక విషయంలో ప్రత్యేక శ్రద్ధ అవసరమయ్యేలా ఉంది. ప్రస్తుతం బాలీవుడ్ లో యాంటీ పాకిస్థాన్ సెంటిమెంట్ అంతగా వర్కౌట్ కావడం లేదు. పదే పదే శత్రుదేశం మీద ఒకే తరహా కథలు, ట్రీట్ మెంట్ చూపిస్తున్నారని ఆడియన్స్ అసహనంగా ఉన్నారు. అందుకే టైగర్ 3, ఫైటర్ లకు అదిరిపోయే ఓపెనింగ్స్ రాలేదు. ట్రైలర్ లోనే స్టోరీ చెప్పేయడంతో ఇంతకన్నా ఏముంటుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కేవలం పాక్ ని తిట్టుకుంటూ నాలుగైదు ఫైట్లు పెట్టేస్తే బాక్సాఫీస్ వద్ద కనక వర్షం కురిసే సీన్ లేదు.

ఈ ట్రెండ్ కి నాగచైతన్యకి కనెక్షన్ ఏంటంటే తండేల్ కూడా పాకిస్థాన్ లో ఇరుక్కుపోయిన స్నేహితులను హీరో విడిపించుకుని వచ్చే ప్లాట్ మీద జరుగుతుంది. వాళ్ళ జైల్లో బందీ కావడం, తప్పించుకోవడం, అక్కడి ఆఫీసర్లకు సవాల్ విసరడం ఈ టైపులో ఉంటుంది. కాబట్టి ఈ ఎలిమెంట్ రొటీన్ అనిపించకుండా హ్యాండిల్ చేయడం అవసరం. ముఖ్యంగా హిందీ మార్కెట్ లో ఇది కీలక అంశంగా పరిణమిస్తుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్న తండేల్ ని ఈ సంవత్సరమే రిలీజ్ చేసేందుకు బన్నీ వాస్, ఆలు అరవింద్ ప్లాన్ చేస్తున్నారు. కాకపోతే ఇప్పటికిప్పుడు నిర్ధారణకు రాలేరు.