ఆర్ఆర్ఆర్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం దేవర మీద ఏ స్థాయిలో అంచనాలు ఉన్నాయో తెలిసిందే. దర్శకుడు కొరటాల శివ చివరి చిత్రం ఆచార్య డిజాస్టర్ అయినప్పటికీ ఆ ఇంపాక్ట్ ఏమీ దేవర మీద పడలేదు. మొదటి నుంచే భారీ హైప్ తెచ్చుకున్న ఈ సినిమాకు అందుకు తగ్గట్లే బిజినెస్ జరుగుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి.
ముందు అనుకున్న ప్రకారం ఏప్రిల్ 5న దేవర రిలీజ్ అయ్యే అవకాశాలు దాదాపుగా లేనప్పటికీ.. సినిమాకు ఓవర్సీస్ డీల్ పూర్తయినట్లు తాజా సమాచారం. హంసిని ఎంటర్టైన్మెంట్స్ అనే సంస్థ ఏకంగా 27 కోట్లు పెట్టి దేవర ఓవర్సీస్ రైట్స్ కొనుక్కుందట. ఇది టాలీవుడ్ చరిత్రలోనే బిగ్గెస్ట్ ఓవర్సీస్ డీల్స్ లో ఒకటని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
ఓవర్సీస్ రైట్స్ 27 కోట్లు పలికాయి అంటే.. దేవర అక్కడ ఏకంగా 5.5 మిలియన్ డాలర్ల వసూళ్లు రాబట్టాలి. సోలో హీరోగా ఎన్టీఆర్ చివరి సినిమా అరవింద సమేత ఓవర్సీస్ లో రెండున్నర మిలియన్ డాలర్ల దాకా కలెక్షన్లు తెచ్చుకుంది. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ ఇమేజ్, ఫాలోయింగ్, మార్కెట్ ఎంత పెరిగినప్పటికీ.. ఐదున్నర మిలియన్ డాలర్ల టార్గెట్ అంటే మోయలేని భారమే.
రాజమౌళి, ప్రభాస్ పక్కన సినిమాలు పక్కన పెడితే.. ఇంకే స్టార్ హీరో కూడా ఇప్పటిదాకా సోలోగా నాలుగు మిలియన్ల మార్కును కూడా అందుకోలేదు. అలాంటిది ఏకంగా ఐదున్నర మిలియన్ల టార్గెట్ అంటే ఆషామాషీ విషయం కాదు. బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకొని రెండు మూడు వారాల పాటు బాగా ఆడితే తప్ప టార్గెట్ అందుకోవడం కష్టం. మరి ఈ భారాన్ని ఎన్టీఆర్- కొరటాల ఎలా మోస్తారో చూడాలి.