సంక్రాంతికి వచ్చిన సినిమాల్లో అవుట్ రైట్ గా డిజాస్టర్ అయ్యింది సైంధవ్ ఒక్కటే. పాతిక కోట్ల దాకా థియేట్రికల్ బిజినెస్ చేస్తే కేవలం ఎనిమిది కోట్లే రాబట్టిందని ట్రేడ్ టాక్. మూడు నాలుగు రోజులు మినహాయించి దాదాపు అన్ని చోట్ల డెఫిషిట్లకు వెళ్లిపోవడంతో టీమ్ ఒక్కసారిగా సైలెంట్ అయిపోయి ప్రమోషన్లు ఆపేసింది. ఏదైనా పికప్ ఆశించడం కూడా కష్టమే. దర్శకుడు శైలేష్ కొలనుని విపరీతంగా నమ్మిన వెంకటేష్ దానికి తగ్గట్టు కనీసం సగం ఫలితం కూడా అందుకోలేకపోవడం అభిమానులను తీవ్రంగా నిరాశ పరిచింది. ఇక్కడ తరుణ్ భాస్కర్ ప్రస్తావన ఎందుకు వచ్చిందో చూద్దాం.
సుమారు రెండేళ్ల క్రితం వెంకటేష్ 75వ సినిమాకు డైరెక్టర్ ఎవరైతే బాగుంటుందనే చర్చ వచ్చినప్పుడు తరుణ్ భాస్కర్ చెప్పిన లైన్ సురేష్ బాబుకి బాగా నచ్చేసిందట. అయితే సెకండ్ హాఫ్ ని డెవలప్ చేసే క్రమం ఎవరిని సంతృప్తి పరిచేలా రాకపోవడంతో పలు దఫాల డిస్కషన్ల తర్వాత ఆపేశారు. గుర్రపు పందేలు, మాఫియా చుట్టూ ఏదో డిఫరెంట్ గా అనుకున్న పాయింట్ అది. అప్పటికే తరుణ్ టైం ఎక్కువ ఖర్చయిపోవడంతో చేతిలో సిద్ధంగా ఉన్న కీడా కోలాతో ప్రొసీడ్ అవుదామని సురేష్ బాబు చెప్పడంతో తక్కువ బడ్జెట్ తో దాన్ని వీలైనంత వేగంగా దాన్ని తెరకెక్కించారట.
తీరా చూస్తే తరుణ్ భాస్కర్ కి కీడా కోలా గొప్ప పేరేమి తీసుకురాలేదు. వసూళ్లు ఓకే కానీ ఈ నగరానికి ఏమైంది స్థాయిలో లేదనే కామెంట్స్ ఓపెన్ గా వినిపించాయి. ఇటు చూస్తేనేమో సైంధవ్ బోల్తా కొట్టేసింది. ఒకవేళ ఇంకాస్త సీరియస్ గా ముందు అనుకున్న ప్రాజెక్టు మీదే వర్క్ చేసి ఉంటే మంచి సినిమా అయ్యేదేమోనని ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు. ఒక ల్యాండ్ మార్క్ గా నిలిచిపోవాలని కోరుకున్న 75వ సినిమా మరీ ఇంత అన్యాయంగా బాక్సాఫీస్ వద్ద డుంకీ కొట్టడం వాళ్లకు షాకే. రానా నాయుడు సీజన్ 2 కోసం రెడీ అవుతున్న వెంకీ నెక్స్ట్ ఎవరికి ఛాన్స్ ఇస్తారనేది సస్పెన్స్ గానే ఉంది.