2024 ఆస్కార్ నామినేషన్లలో ఒక్క డాక్యుమెంటరీ తప్ప భారతీయ సినిమాలకు చోటు దక్కకపోవడం మూవీ లవర్స్ ని తీవ్రంగా నిరాశ పరిచింది. తెలుగు నుంచి హిందీ దాకా ఏ ఒక్కటి అర్హత సాధించలేకపోవడం నిజంగా విచారకరం. ఇక్కడే రాజమౌళి సత్తా ప్రపంచానికి మరోసారి అర్థమవుతోంది. ఆర్ఆర్ఆర్ విషయంలో జక్కన్న తీసుకున్న చొరవ, ప్రత్యేక శ్రద్ధ, దేశ విదేశాలకు వెళ్లి ప్రీమియర్లు హాజరై, బిజీగా ఉన్న ఇద్దరు స్టార్ హీరోలను ఎప్పుడు కావాలంటే అప్పుడు వెంటేసుకుని క్యాంపైన్లు చేయడం ఇదంతా మాములు విషయం కాదు. నెలల తరబడి చేసిన కఠోర శ్రమకు సాక్ష్యాలు ఉన్న పచ్చి నిజం.
నిజానికి ఈ సంవత్సరం మన దేశం తరఫున సరైన రీతిలో నామినేషన్లు వచ్చేలా ఎవరూ చేయలేకపోయారన్నది వాస్తవం. బలగంని పంపిస్తానని గత ఏడాది చెప్పిన దిల్ రాజు తర్వాత ఆ దిశగా సీరియస్ గా ముందుకెళ్ళలేదు. అటు బాలీవుడ్ లోనూ క్లాసిక్స్ అనిపించుకున్న చిత్రాలు ఉన్నాయి. వాటికీ చోటు దక్కలేదు. మలయాళం, కన్నడల సంగతి సరేసరి. విమర్శకులు శెభాష్ అన్నవి ఊసులో లేకుండా పోయాయి. అసలు ఆర్ఆర్ఆర్ విషయంలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, రాజమౌళి ముగ్గురిలో కనీసం ఒక్కరికైనా అవార్డు వచ్చే సంకల్పంతో ఉదృతంగా ప్రమోట్ చేశారు. చివరికి నాటునాటుకి దక్కింది.
ఆస్కార్ మన నాణ్యతను ఖచ్చితంగా నిర్దేశించే కొలమానం కాదు. ప్రతిసారి రానందుకో లేదా అకాడమీ పట్టించుకోనందుకు బాధ పడాల్సిన అవసరం లేదు. కానీ రాజమౌళి లాగా అర్హత ఉన్నవాటిని ఏ మార్గాల్లో అక్కడిదాకా తీసుకెళ్లొచ్చే వాటిని అన్వేషించాలి. ప్రపంచమంతా పొగిడిన మాయాబజార్, శంకరాభరణం లాంటి క్లాసిక్స్ కి ఆస్కార్ రాలేదు. అలా అని వాటి విలువేమి తగ్గదు. కానీ కొత్త జనరేషన్ ఆస్కార్ ని అంతర్జాతీయ పురస్కారంగా గొప్పగా చూస్తారు కాబట్టి ఆర్ఆర్ఆర్ లాగా క్రమం తప్పకుండా దర్శక నిర్మాతలు తగిన జాగ్రత్తలు తీసుకుని మన విజయావకాశాలను పెంచుకోవాలి.