రిస్క్ తీసుకోవడానికి మిల్లర్ రెడీ

గణతంత్ర దినోత్సవం నాడు తెలుగు ప్రేక్షకులకు డబ్బింగ్ సినిమాలే దిక్కవుతున్నాయి. వాటిలో చెప్పుకోదగినది కెప్టెన్ మిల్లర్. గత ఏడాది సార్ రూపంలో బ్లాక్ బస్టర్ సాధించడంతో ధనుష్ కి ఇక్కడా మార్కెట్ ఏర్పడింది. ఆ నమ్మకంతోనే ఏషియన్-సురేష్-ఎస్విసి లాంటి బడా సంస్థలు పంపిణికి చేయూతనిచ్చి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాయి. అయితే తమిళంలో రెండు వారాల క్రితమే రిలీజైన ఈ పీరియడ్ డ్రామా విమర్శకుల ప్రశంసలు అందుకుని వంద కోట్ల గ్రాస్ కు దగ్గరగా ఉంది. అలా అని యునానిమస్ బ్లాక్ బస్టర్ అనిపించుకోలేదు. ఆడియన్స్ నుంచి మిశ్రమ స్పందనే ఉంది.

సరే అక్కడా అంతగా నచ్చినా నచ్చకపోయినా మనకు కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందేమో. అందుకే నిర్మాతలు ముందు రోజు ప్రీమియర్లకు ప్లాన్ చేస్తున్నారు. ఒక డబ్బింగ్ మూవీకి అది కూడా ఒరిజినల్ వెర్షన్ రిలీజైన పధ్నాలుగు రోజులకు స్పెషల్ షోలు వేయడం గతంలో ఎప్పుడూ జరగలేదు. ఇదే మొదటిసారి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఎంపిక చేసిన కేంద్రాల్లో షోలు వేయబోతున్నారు. ఈ మేరకు అధికారిక ప్రకటన వచ్చింది. ఈ ప్రీమియర్ల ఐడియా గత రెండేళ్ల నుంచి మంచి ఫలితాలు వస్తున్నాయి. మేజర్ నుంచి హనుమాన్ దాకా ఎన్నో బ్లాక్ బస్టర్స్ ఈ ప్లాన్ వల్ల బాగా లాభపడ్డాయి.

అలా అని ఫ్లాప్ అయినవి లేకపోలేదు. రంగబలి, హిడింబ మొదలైనవాటికి ఇదే మైనస్ అయ్యింది. మరి కెప్టెన్ మిల్లర్ ధైర్యం చూస్తుంటే మన జనాల మీద పెద్ద నమ్మకమే పెట్టుకున్నట్టు కనిపిస్తోంది. అరుణ్ మాతేశ్వరన్ దర్శకత్వం వహించిన ఈ భారీ బడ్జెట్ చిత్రంలో సందీప్ కిషన్, శివరాజ్ కుమార్ ప్రత్యేక పాత్రలు పోషించారు. మాస్ కి నచ్చే యాక్షన్ ఎపిసోడ్స్ చాలానే ఉన్నాయి. ఏ స్థాయిలో కనెక్ట్ అవుతాయనేది చూడాలి. అదే రోజు శివ కార్తికేయన్ అయలన్ కూడా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో కెప్టెన్ మిల్లర్ కు ముందస్తుగా వచ్చే టాక్ కీలకం కానుంది. ధనుష్ ఈసారి ఏం చేస్తాడో చూడాలి.