కోర్టు కేసు వల్ల జనవరి 26 యానిమల్ ఓటిటి రిలీజ్ ఉంటుందా లేదానే ఆందోళన వారం పది రోజులుగా అభిమానుల్లో విపరీతంగా ఉంది. ఆ టెన్షన్ అక్కర్లేదని, డిజిటల్ రిలీజ్ కి రూట్ క్లియరయ్యిందని ముంబై రిపోర్ట్. తమ భాగస్వామ్యం ఉన్నా ఆదాయ వ్యయాలకు సంబంధించిన సమాచారాన్ని ఇవ్వలేదని సినీ1 వేసిన కేసుకు సంబంధించిన హియరింగ్ రేపు న్యాయస్థానం ముందు మరోసారి రానుంది. అంతర్గతంగా ఇష్యూ సెటిలయ్యిందని, రేపు జరిగే కోర్టు వాయిదాలో దీనికి సంబంధించిన అంగీకారం ఇరువర్గాల నుంచి వస్తుందని వినికిడి. కాబట్టి స్ట్రీమింగ్ కి ఇబ్బంది లేదు.
ఇవాళ యానిమల్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ 38 నిమిషాల ఒరిజినల్ సౌండ్ ట్రాక్ ని అధికారికంగా యూట్యూబ్ లో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఫ్యాన్స్ కొందరు ట్విట్టర్ వేదికగా ఓటిటి గురించి ప్రశ్నించినప్పుడు రిపబ్లిక్ డే నాడు వస్తుందనే సంకేతంలో ఇండియన్ ఫ్లాగ్ గుర్తుని రీ ట్వీట్ చేయడంతో క్లారిటీ వచ్చింది. సినీ1 సంస్థకు తాముగా గతంలోనే 2.6 కోట్లను చెల్లించామని, ఎక్కడ అగ్రిమెంట్ ని అతిక్రమించలేదని చెబుతూ వచ్చిన టి సిరీస్ కు ఒకవేళ ఓటిటి రిలీజ్ కనక వాయిదా పడితే నెట్ ఫ్లిక్స్ కు భారీ మొత్తాన్ని చెల్లించాల్సి ఉన్నందువల్ల రాజీ మార్గం చూశారట.
ఇదంతా ఎలా ఉన్నా యానిమల్ వచ్చిన మరుక్షణం నుంచే సోషల్ మీడియా మళ్ళీ హోరెత్తిపోయేలా ఉంది. థియేటర్లో చూసినప్పుడే దీని గురించి రకరకాల చర్చలు జరిగాయి. అక్కడ మిస్ అయినవాళ్లు ఓటిటిలో చూశాక తిరిగి ఎన్ని పాయింట్స్ లేవనెత్తుతారో చూడాలి. పైగా తొమ్మిది నిమిషాల అదనపు ఫుటేజ్ తో పాటు సెన్సార్ చేయని వర్షన్ ఉంటుందని ఇప్పటికే టాక్ ఉంది. ఎప్పటికప్పుడు విమర్శలను కౌంటర్ చేస్తూ వచ్చిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా మళ్ళీ డ్యూటీ చేయాల్సి వచ్చేలా ఉంది. నెట్ ఫ్లిక్స్ చరిత్రలో అత్యధిక వ్యూస్ సాధించిన టాప్ ఫైవ్ మూవీస్ యానిమల్ ఉంటుందని అంచనా.