ప్రభాస్ డైలాగులు మూడు నిమిషాలే

స్టార్ హీరోల సినిమాలకు సంబంధించిన కొన్ని విషయాలు థియేటర్లో చూస్తున్నప్పుడు పట్టించుకోలేం. పైగా ఫార్వార్డ్ రివైండ్ లాంటి ఆప్షన్లు ఉండవు కాబట్టి ఏదైనా మిస్ అయితే వెనక్కు ముందుకు వెళ్లే ఛాన్స్ ఉండదు. కానీ ఓటిటిలో వచ్చాక అలా కాదు. ప్రతి పాయింట్ శల్యపరీక్షకు గురవుతుంది.

సలార్ నిన్న నెట్ ఫ్లిక్స్ లో వచ్చినప్పటి నుంచి దాని హంగామా మాములుగా లేదు. ఒకపక్క అఫీషియల్ ఓటిటి ఛానల్ లో చూస్తున్న వాళ్ళు, ఇంకోవైపు ఇతరత్రా ఆన్ లైన్ మార్గాల్లో ఎంజాయ్ చేస్తున్న వాళ్ళు లక్షల్లో కాదు కోట్లలో ఉన్నారు. మిలియన్ల వ్యూస్ వెల్లువలా వచ్చి పడుతున్నాయి.

ప్రభాస్ సంభాషణలు సలార్ లో చాలా తక్కువగా ఉన్న మాట వాస్తవమే కానీ ఎంత లెన్త్ అనేది క్లారిటీ లేదు. అభిమానులు కొందరు మొత్తం సినిమాలో తమ డార్లింగ్ మాట్లాడిన డైలాగులన్నీ ఒక చోట చేర్చి దాన్నో వీడియో క్లిప్ గా మార్చి షేర్ చేయడం మొదలుపెట్టారు.

నిడివి ఎంత ఉందయ్యా అంటే మొత్తం కలిపి నాలుగు నిమిషాల లోపే. కొంచెం స్పీడ్ మోడ్ లో పెడితే అది రెండున్నర నిమిషాలకు కుదించుకుపోతోంది. కాసిన్ని ఎక్కువ మాటలు ఉన్నది కూడా సెకండ్ హాఫ్ లో అది కూడా పృథ్విరాజ్ సుకుమారన్ కాంబినేషన్ లో మాత్రమే. ఇంత డీటెయిల్డ్ గా తవ్వి తీశారు ఫ్యాన్స్.

ఇంత తక్కువ మాట్లాడి వందల కోట్లు వసూలు చేసే బ్లాక్ బస్టర్ సాధించడం ఒక్క ప్రభాస్ కే సాధ్యమేమో. ఇంతే కాదు సలార్ లో కీలక పాత్రధారులైన శ్రేయ రెడ్డి, టినూ ఆనంద్, దేవరాజ్, బ్రహ్మాజీ తదితరులెవరితోనూ నేరుగా సంభాషణలు లేకపోవడం మరో ట్విస్టు.

పృథ్విరాజ్ తర్వాత డార్లింగ్ కాస్త మాట్లాడింది అంటే ఈశ్వరిరావుతోనే. మొత్తం ప్రశాంత్ నీల్ యాక్షన్ విజువల్స్, రవి బస్రూర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మహత్యంలో ఆడియన్స్ ఈ సంగతి ఎక్కువగా గుర్తించలేదు. ప్రభాస్ పలికిన అన్ని డైలాగులు ఒక పేపర్ మీద పెడితే అవి మహా అయితే పేజిన్నర దాటడం గొప్పే అనుకోవాలి.