నందమూరి కళ్యాణ్ రామ్ కొత్త సినిమా డెవిల్ డైరెక్షన్ క్రెడిట్ విషయంలో నెలకొన్న వివాదం సంగతి తెలిసిందే. ఈ సినిమా మొదలైనపుడేమో దర్శకుడిగా నవీన్ మేడారం పేరుంది. కానీ టీజర్ లాంచ్ అయినపుడు డైరెక్టెడ్ బై ‘అభిషేక్ నామా పిక్చర్స్ టీం’ అని వేశారు. కానీ సినిమా రిలీజ్ సమయానికేమో నిర్మాత అభిషేక్ నామానే దర్శకుడైపోయాడు. డెవిల్ సినిమాకు తనే దర్శకుడినని, స్క్రిప్ట్ దశ నుంచి అన్ని తానై వ్యవహరించానని.. 105 రోజుల పాటు ఈ సినిమాను వివిధ లొకేషన్లలో చిత్రీకరించానని రిలీజ్ ముంగిట ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు నవీన్ మేడారం.
కానీ నిర్మాత అభిషేక్ నామా మాత్రం.. షూటింగ్ రెండో రోజే డెవిల్ చిత్రాన్ని తాను టేకోవర్ చేసినట్లుగా చెప్పుకున్నాడు. కట్ చేస్తే డెవిల్ సినిమా రిలీజ్ అయింది. ఓ మోస్తరు స్పందన తెచ్చుకుంది. సినిమా టెక్నికల్ గా బలంగా కనిపించడంతో దర్శకుడిగా నవీన్ హ్యాండ్ ఉండే ఉంటుందన్న చర్చ జరిగింది.
ఈ నేపథ్యంలో నవీన్ ప్రొడక్షన్లో తెరకెక్కి ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న నైంటీస్ మిడిల్ క్లాస్ వెబ్ సిరీస్ సక్సెస్ సెలబ్రేషన్లలో భాగంగా డెవిల్ గురించి నవీన్ కు ప్రశ్న ఎదురైంది. దానికి అతను బదులిస్తూ.. తాను తాను డెవిల్ సినిమా చూశానని, ముందు అనుకున్న స్క్రిప్ట్ తో పోలిస్తే కొన్ని మార్పులు చేశారని అన్నాడు. అంతకుమించి ఈ సంభాషణను పొడిగించకుండా డెవిల్ సినిమా గురించి మాట్లాడడానికి ఈ సందర్భం కాదని.. ఈ చర్చకు తెర దించేశాడు నవీన్. తాను స్పై నిర్మాతలతో ఒక భారీ చిత్రం చేయబోతున్నానని, అది 300 బిసి కాలానికి చెందినదని అతను వెల్లడించాడు.