టిల్లూ….పెద్ద చిక్కు వచ్చి పడిందే

సంక్రాంతి రేసు నుంచి ఈగల్ తప్పుకున్నందుకు తాను ఫిక్స్ చేసుకున్న రిలీజ్ డేట్ ఫిబ్రవరి 9ని త్యాగం చేసినందుకు టిల్లు స్క్వేర్ కి కొత్త చిక్కొచ్చి పడింది. కొత్త విడుదల తేదీ నిర్ణయించుకోవడంలో యూనిట్ సతమతమవుతోందని టాక్. నిజానికి షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు. బ్యాలన్స్ ఉన్న భాగాన్ని ఆర్టిస్టుల డేట్లకు అనుగుణంగా దర్శకుడు మల్లిక్ రామ్ ప్లాన్ చేసుకుంటూ వెళ్తున్నాడు. పలు రీ షూట్లు కూడా జరిగాయని న్యూస్ ఉంది. అయితే ఫిబ్రవరి చివరి వారంలోపు ఫస్ట్ కాపీ సిద్ధం కాకపోవచ్చు కాబట్టి మార్చి నెలాఖరుకు వెళ్లేలా సితార పెద్దలు తీవ్ర సమాలోచనలు చేస్తున్నట్టు తెలిసింది.

ఇక్కడ కొన్ని సమస్యలున్నాయి. మార్చి 30 అనుకుంటే కేవలం వారం గ్యాప్ లో దేవర వస్తుంది. జూనియర్ ఎన్టీఆర్ ప్యాన్ ఇండియా మూవీగా దాని మీద ఉన్న బజ్ తెలిసిందే. పైగా అనిరుద్ రవిచందర్ సంగీతం కావడంతో ముందే దీనికి సంబంధించిన హడావిడి సోషల్ మీడియాలో జరగుతుంటుంది. ఈ వేడిలో టిల్లు స్క్వేర్ తనవైపు అటెన్షన్ వచ్చేలా చేసుకోవడం కష్టం. సో దేవర ఖచ్చితంగా ఏప్రిల్ 5 వస్తుందో రాదో తేలాలి. ఇంకా పాటల చిత్రీకరణతో పాటు కొంత టాకీ పార్ట్ బాలన్స్ ఉందట. చేతిలో ఉన్నది కేవలం 75 రోజులు. ఇందులో ప్రమోషన్లు ఈవెంట్లు అన్నీ చేసుకోవాలి.

ఒకవేళ దేవర కనక చెప్పిన డేట్ కే లాక్ చేసుకుంటే టిల్లు స్క్వేర్ ఇంకో ఆప్షన్ చూసుకోవాల్సి ఉంటుంది. వీలైనంత ముందుగా కర్చీఫ్ వేసుకోవడం అవసరం. ఎందుకంటే ఇండియన్ 2 అదే నెలలో రావొచ్చనే లీక్ చెన్నై మీడియాలో తిరుగుతోంది. యూత్ లో ఎంత క్రేజ్ ఉన్నా వీలైనంత తక్కువ పోటీలో రావడమే టిల్లు స్క్వేర్ కు మేలు చేస్తుంది. ముఖ్యంగా స్టార్లతో తలపడకుండా చూసుకోవాలి. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించిన ఈ రొమాంటిక్ థ్రిల్లర్ కోసమే సిద్దు జొన్నలగడ్డ విలువైన రెండేళ్ల కాలాన్ని త్యాగం చేసుకున్నాడు. పోస్ట్ ప్రొడక్షన్ వల్ల మార్చి మధ్యలో వచ్చే ఛాన్సూ లేదట.