కన్నప్ప గురించి అలా అన్నందుకు విష్ణు హర్ట్

Manchu Vishnu
Manchu Vishnu

మంచు విష్ణు హీరోగా తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం కన్నప్ప. ఈ ప్రాజెక్టు గురించి దశాబ్ద కాలం కిందటి నుంచి చెబుతూ వస్తోంది మంచు ఫ్యామిలీ. ఎట్టకేలకు గత ఏడాది ఈ చిత్రాన్ని మొదలుపెట్టారు. బడ్జెట్ 100 కోట్లకు పై మాటే.

ముఖేష్ కుమార్ సింగ్ అనే హిందీ దర్శకుడితో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. దాదాపు 600 మంది కాస్ట్ అండ్ క్రూతో న్యూజిలాండ్ కి వెళ్లి అక్కడే కొన్ని నెలల పాటు మేజర్ షెడ్యూల్ చిత్రీకరణ జరిపింది టీం. ప్రస్తుతం ఇండియాలోనే కొత్త షెడ్యూల్ జరుగుతోంది. దీంతో పాటే విజువల్ ఎఫెక్ట్స్ పనులు కూడా చేయిస్తునారు. అయితే అందరూ అనుకుంటున్నట్లు ఇది కల్పిత కథ కాదని.. చరిత్రలో జరిగిన విషయాలే చూపిస్తున్నామని మంచు విష్ణు తెలిపాడు.

ఇటీవల సంక్రాంతి టైంలో తాను ట్విట్టర్లో జరిపిన చిట్ చాట్ సందర్భంగా కన్నప్పకి సంబంధించి ఎదురైన కొన్ని ప్రశ్నలు తనకు ఇబ్బంది కలిగించాయని విష్ణు తెలిపాడు. కొందరు ఇతర రాష్ట్రాల, ఉత్తరాది నెటిజెన్లు ఈ మైథాలజికల్ ప్రాజెక్టు రిలీజ్ ఎప్పుడు అని నన్ను ప్రశ్నించారని.. కన్నప్పను మైథాలజీ అనడం తనకు బాధ కలిగించిందని విష్ణు తెలిపాడు. మైథాలజీ అంటే హిస్టారికల్ గా ప్రూఫ్ లేనిది అని అర్థం అని.. కన్నప్ప అలాంటి సినిమా కాదని మంచు విష్ణు తెలిపాడు.

నాసా వాళ్లు రామసేతు ఉంది అని అంటే నమ్ముతామని.. కానీ మనకు మనంగా మన చరిత్రను నమ్మమని మంచి విష్ణు వ్యాఖ్యానించాడు. భక్త కన్నప్పకు సంబంధించి పుస్తకాల్లో ఉన్నది ప్రతిదీ నిజంగా జరిగిందే అని.. అందుకు నిదర్శనం శ్రీకాళహస్తీశ్వరాలయం.. అందులోని వాయు లింగం నిదర్శనం అని మంచు విష్ణు వ్యాఖ్యానించాడు. కన్నప్ప మైథాలజికల్ మూవీ కాదని.. నిజమైన శివ భక్తుడు కన్నప్ప కథ అని విష్ణు అన్నాడు.