సమీక్ష….వి

V Movie Review

చేసిన జానర్ లో సినిమా చేయకుండా వుండాలని, తరచు వైవిధ్యం ప్రదర్శించాలని అనుకోవడంలో తప్పు లేదు. కానీ తనవి కాని జోళ్లలో కాళ్లు పెట్టుకోవాలని అనుకోవడం మాత్రం ముమ్మాటికీ తప్పే. దర్శకుడు ఇంద్రగంటి ఈ తప్పే చేసారు. చక్కటి ఇంగ్లీష్ క్లాసిక్ నవలల్లోని సున్నితమైన హాస్యాన్ని తన సినిమాల్లో చొప్పించి, క్లాస్ ఎంటర్ టైన్ మెంట్ మూవీస్ ను అందిస్తారని పేరు తెచ్చుకున్న ఇంద్రగంటి, తొలిసారి ఓ సైకో థ్రిల్లర్ సినిమా అందించాలని వృధా ప్రయత్నం చేసారు.

కేవలం టెక్నాలజీ మీద దృష్టి ఎక్కువ పెట్టి, స్క్రిప్ట్ మీద దృష్టి తక్కువ పెట్టడం అన్నది ఈ సినిమా వైఫల్యానికి అసలు సిసలు కారణం. ఇలాంటి సినిమాలకు పెద్ద బాల శిక్ష లాంటిది ఏనాడో కొన్ని దశాబ్దాల కిందట భారతీరాజా తీసిన ఖైదీ వేట. కమల్ ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమాలో ప్రేక్షకులు హత్యలు చేసే కమల్ పాత్రతో పాటు ప్రయాణిస్తారు. కేవలం హత్యల కోసం ఆ సినిమా చూడరు. హత్యలు చేసే కమల్ పాత్ర తీరుతెన్నులు, హావభావాలు, నటన ప్రేక్షకులను కట్టి పడేస్తుంది.

దశాబ్ధాల కాలం తరువాత ఇంద్రగంటి లాంటి ఇంటలెక్చువల్ డైరక్టర్ ఇలాంటి సినిమాల్లో వుండాల్సిన కీలక పాయింట్ ను పట్టుకోలేకపోయారు. ఓ స్టయిలిష్ థ్రిల్లర్ ను అందించాలని తహతహలాడారు. పాత్రల రూపకల్పన పై సరైన దృష్టి పెట్టక, కేవలం పై పై మెరుగులతో చమక్కలు చేద్దామనుకున్నారు. దీంతో సినిమాకు అవసరమైనంత ముడిసరుకు స్క్రిప్ట్ రూపంలో అందలేదు. ఆ సంగతి గమనించి అక్కరలేని సంభాషణలు, సన్నివేశాలతో సినిమాను నింపేసారు.

దర్శకుడు తను వేసిన చిక్కుముడులను తానే విప్పలేక, కేవలం ఓ చిన్న పాత్రతో పావుగంట నెరేషన్ చెప్పించి, మొత్తం సినిమా అక్కడే చూపించేసాను అనిపించేసుకున్నారు. సినిమా మొత్తం మీద అయిదు మర్డర్లు చేయాల్సి వుంది. అలాంటిది రెండు మర్డర్ల తరువాతే దర్వకుడు చేతులు ఎత్తేసారు. కథను మెయిన్ రోడ్ మీద నుంచి సందు గొందుల్లోకి మళ్లించేసారు.

అసలు ఇలాంటి కథను హీరో, నిర్మాత ఎలా ఓకె చేసారు అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఎందుకంటే ఖైదీ వేట నుంచి ప్రారంభించి ఇప్పటి వరకు ఇలాంటి సినిమాలు సవాలక్ష వచ్చాయి. సరే, లైన్ పాతదే కావచ్చు, టేకింగ్ కొత్తగా వుండోచ్చుగా అనే పాయింట్ ఆఫ్ ఆర్డర్ ను ఎవరైనా లేవనెత్తొచ్చు. కానీ దర్శకుడు ఇంద్రగంటి ఎంతమాత్రం ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయారు.

థ్రిల్లర్ కాబట్టి వి సినిమా కథ చెప్పకూడదు అని నియమం పెట్టుకోనక్కరలేదు. ఎందుకంటే ఈ సినిమా కథ తొలి నుంచీ తెలిసిపోతూనే వుంటుంది. తన ప్రియురాలికి జరిగిన అన్యాయానికి హీరో పగ తీర్చుకోవడం. అందుకోసం వరుసగా హత్యలు చేసుకుంటూ పోవడం. దీన్ని అడ్డుకోవడానికి మరో హీరో ప్రయత్నించడం. ఇదీ కథ. సినిమా ప్రారంభంలోనే చకచకా రెండు హత్యలు జరిగిపోతాయి. కేవలం కిల్లర్ గా కాకుండా హీరోను సైకో కిల్లర్ గా చూపించాల్సిన అవసరం ఏమిటో అర్థం కాదు. అంటే ప్రేక్షకులను తప్పుదారి పట్టించాలి అని దర్శకుడు ఇలా చేసి వుండొచ్చు. కానీ నానిలో ఆ సైకో లక్షణాలు కానీ, ఆ కిల్లర్ లక్షణాలు కానీ మచ్చుకు కూడా తొంగి చూడకపోడం మైనస్ అయింది.

పైగా తన మార్కు ఫన్ మిస్ కాకూడదని దర్శకుడు ఇద్దరు హీరోలతో కొన్ని కొన్ని సీన్లు జోడించాడు. నాన్ స్టాప్ ఎక్స్ ప్రెస్ లా పరుగుపెట్టాల్సిన థ్రిల్లర్ సినిమాల్లో ఇలాంటి వ్యవహారాలు దారుణమైన స్పీడ్ బ్రేకర్లుగా మారతాయి. అలాగే మారాయి కూడా. గట్టిగా మూడు మర్డర్లు కాకుండానే హీరోకు విలన్ ఎవరో, ఆ సంగతేమిటితో తెలిసిపోతుంది. దర్శకుడు చేసిన మరో తప్పిదం ఇది. దీని తరువాత ఫ్లాష్ బ్యాక్ ప్రారంభమై ప్రేక్షకుల సహనాన్ని ఎంత పరీక్షించాలో అంతా పరీక్షించేసింది. అంతే కాదు, సినిమా మొత్తాన్ని సర్రున వెనక్కు లాగి ఎక్కడికో విసిరేసింది.

తీరా క్లయిమాక్స్ పూర్తయిన తరువాత జనాలకు అంతా తెలిసిపోయింది, ఇంకెంత సేపు సినిమా నడిపిస్తాం అనే ఆలోచనతో ఓ చోటా మోటా క్యారెక్టర్ ను తీసుకువచ్చి, మొత్తం కథ అంతా చెప్పించేసి, ఓ పది రీళ్లు పొదుపు చేసారు. ఇలా చేసేస్తే ఇక తన గొప్ప ఏముంది అనుకున్నాడేమో దర్శకుడు, ఇద్దరు హీరోలను నిజమైన హీరోలుగా మార్చి కానీ సినిమాను ముగించను అని పంతం పట్టి, ఆ దిశగా మరి కొన్ని సీన్లు రాసుకుని, హమ్మయ్య అయిపోయింది అనిపించుకున్నాడు.

ఇలాంటి సినిమాలో వైవిధ్యమైన నటన చూపించాలనినాని అనుకోవడంలో తప్పు లేదు. కానీ ఆ పాత్ర డిజైన్ బాగాలేదు. ఆ పాత్రను కిల్లర్ గా చూపిస్తే వేరేగా వుండేదేమో, సైకో కిల్లర్ అనేట్లు చూపించి చేచేతులా పాడుచేసుకున్నారు. అరివీర పోలీస్ ఆఫీసర్ అనిపించేలా ఇంట్రడక్షన్ ఇచ్చి సుధీర్ బాబును డమ్మీని చేసారు. పొడుపు కథ విప్పి, చిన్న పిల్లాడిలా పొంగిపోవడం భలే ఫన్నీ సీన్. లేపాక్షి కి అర్థం అంటూ దర్శకుడు తన జనరల్ నాలెడ్జి అంతా చూపించిన వైనం మరీ మరీ ఫన్నీ సీన్.

రాఘవేంద్రరావు, బోయపాటి ల టేకింగ్ ప్రస్తావన, మహేష్ లోడు ఎత్తాలిరా లాంటి డైలాగులు సినిమాకు వాడుకోవడం అన్నది ఇంద్రగంటి లాంటి రచయిత కమ్ దర్శకుడు చేయాల్సిన పని కాదు. అన్నింటికి మించి దర్వకుడు చేసిన అతి పెద్ద తప్పు మరోటి వుంది. నాని, సుధీర్ బాబు, నివేధా థామస్, అదితిరావ్ హైదరి, తప్ప మిగిలిన కీలక పాత్రలకు చిన్న చితక నటులను తీసుకోవడం. తనికెళ్ల, నరేష్, రోహిణి లాంటి వాళ్లకు అవసరం లేని క్యారెక్టర్లు ఇవ్వడం. హీరోల గెటప్ ల విషయంలో తీసుకున్న శ్రద్ద హీరోయిన్ల విషయంలో అస్సలు తీసుకోలేదు. అదితిరావ్ అయితే ఈ మొహం ఏంట్రా బాబూ అనేట్లు వుంది.

దారుణంగా చావాల్సిన అయిదుగురు విలన్లుగా సరైన అయిదుగురు నటులను తీసుకోకపోవడం అంటే మితిమీరిన అతి విశ్వాసం అనుకోవాలి. సినిమాలో ఖర్చు అంతా సాంకేతికత కే చేసినట్లు కనిపిస్తుంది. సినిమాటోగ్రఫీ, రీ రికార్డింగ్ ఆ ఖర్చును క్లియర్ గా చూపించాయి. కానీ ఆ ఖర్చు సినిమాను కాపాడలేదు. నిజానికి ఈ సినిమా కరోనా టైమ్ లో రెడీ కావడం, అమెజాన్ కు అమ్ముడుపోవడం నిర్మాత చేసుకున్న అదృష్టం. నాని-సుధీర్-అదితి-నివేదా లాంటి తారాగణం, ఇంద్రగంటి డైరక్షన్, దిల్ రాజు నిర్మాణం ఆశించిన వారికి ఇలాంటి సినిమా తెరమీద చూడడం దురదృష్టం

ఫినిషింగ్ టచ్……వి…ఫర్…వృధా

రేటింగ్ – 2.5/5