గత ఏడాది సర్ రూపంలో మొదటి టాలీవుడ్ స్ట్రెయిట్ మూవీ చేసి బ్లాక్ బస్టర్ అందుకున్న ధనుష్ ఇప్పుడు కెప్టెన్ మిల్లర్ గా రాబోతున్నాడు. జనవరి 12 తమిళంతో పాటు రిలీజ్ కావాల్సినప్పటికీ తెలుగులో విపరీతమైన పోటీ కారణంగా రెండు వారాలు ఆలస్యంగా జనవరి 25న బాక్సాఫీస్ కు వస్తున్నాడు. ఒరిజినల్ వెర్షన్ విమర్శకుల మెప్పు పొందిన నేపథ్యంలో ఇక్కడి ప్రేక్షకుల్లోనూ ప్రత్యేక అంచనాలు నెలకొన్నాయి. నాని గ్యాంగ్ లీడర్, శర్వానంద్ శ్రీకారంలతో పరిచయమై ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఓజి చేస్తున్న ప్రియాంక మోహన్ హీరోయిన్ కావడం మరో ఆకర్షణగా నిలుస్తోంది.
స్వాతంత్రం రాకముందు తెల్లదొరల పాలనలో ఎందరో భారతీయులు బానిసలుగా మగ్గుతున్న కాలం. వాళ్ళ అరాచకాలకు దారుణంగా బలవుతున్న ఓ గూడెం ప్రజలకు అండగా నిలబడతాడు మిల్లర్(ధనుష్). తుపాకీ పట్టి తీవ్రవాదిగా మారి బ్రిటిషర్లను పిట్టలను కాల్చినట్టు చంపుతూ ప్రభుత్వానికి తలనెప్పిగా మారతాడు. ఇతని పోరాటంలో అండగా మరో ఇద్దరు ఆఫీసర్లు(శివరాజ్ కుమార్ – సందీప్ కిషన్) తోడుగా వస్తారు. తీరా చూస్తే ఈ మిల్లర్ ఒకప్పుడు యువకుడిగా ఇదే ఇంగ్లీష్ గవర్నమెంట్ లో మిలిటరీలో పని చేశాడని తెలుస్తుంది. ఇంతకీ మిల్లర్ కథేంటో చూడాలంటే కొంత ఆగాల్సిందే.
దర్శకుడు అరుణ్ మాతేశ్వరన్ అప్పటి వాతావరణాన్ని ప్రతిబింబించేలా కెప్టెన్ మిల్లర్ ని తెరకెక్కించిన విధానం ఆసక్తి రేపుతోంది. భారీ బడ్జెట్, యాక్షన్ ఎపిసోడ్స్, విజువల్ ఎఫెక్ట్స్ తో పాటు ఆర్టిస్టులందరికీ పెర్ఫార్మన్స్ ఇచ్చే పాత్రలే పడ్డాయి. జివి ప్రకాష్ కుమార్ సంగీతం, సిద్దార్థ నుని ఛాయాగ్రహణం మంచి స్టాండర్డ్ లో సాగాయి. శివ కార్తికేయన్ ఆయలాన్ తో పాటు ఒక రోజు గ్యాప్ తలపడుతున్న కెప్టెన్ మిల్లర్ అంచనాలు రేపడంలో సక్సెసయ్యింది. ఇలాంటి కాన్సెప్ట్ లు మన దగ్గర ఆడటం అరుదే అయినా కంటెంట్ బాగుంటే జనాలు నిక్షేపంగా స్వీకరిస్తున్న ట్రెండ్ లో ధనుష్ ఎలాంటి ఫలితం అందుకుంటాడో చూడాలి