ఆలస్యం వల్ల ‘మిల్లర్’కు మేలే జరిగింది

మొన్న జనవరి 12న తమిళంలో విడుదలైన కెప్టెన్ మిల్లర్ ఇక్కడ 25న రిలీజ్ కాబోతోంది. సురేష్, ఏషియన్ సంస్థలు సంయుక్తంగా పంపిణి చేస్తున్నాయి. నిజానికి ముందు 19 అనుకున్నారు. అప్పటికి సంక్రాంతి హడావిడి తగ్గిపోయి ఉంటుందనే ఉద్దేశంతో. కానీ హనుమాన్ తాకిడి విపరీతంగా ఉండటంతో పాటు గుంటూరు కారం థియేటర్లు రెండు వారాలకు అగ్రిమెంట్లు చేసుకోవడం పరిస్థితిని క్లిష్టంగానే ఉంచుతోంది. పైగా నా సామిరంగ పాజిటివ్ టాక్ సెకండ్ వీక్ నుంచి డిమాండ్ పెంచింది. ఒక్క సైంధవ్ మాత్రమే అండర్ పెర్ఫార్మ్ చేయడం వల్ల అనుకున్న స్థాయిలో కొనసాగించడం కష్టం.

ఇప్పుడు వీలైనంత లేట్ గా రావడం కెప్టెన్ మిల్లర్ కు మేలే చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడప్పుడే జనాలు కొత్త సినిమాల మూడ్ లోకి వచ్చేలా లేరు. కొంత బ్రేక్ ఇవ్వాలి. పైగా హనుమాన్ చూడని ఆడియన్స్ సంఖ్య భారీగా ఉంది. వీళ్లంతా వీకెండ్ షోస్ కి ప్లాన్ చేసుకుంటున్నారు. సో ఇంకో వారం గ్యాప్ దొరికితే అప్పుడు క్రమంగా కొత్త రిలీజుల వైపు మనసు మళ్లుతుంది. ధనుష్ కి తెలుగులో సార్ నుంచి మార్కెట్ పెరిగింది. అది ఊహించిన దానికన్నా బ్లాక్ బస్టర్ కావడంతో సహజంగానే అతని కొత్త సినిమాలకు హైప్ వచ్చేస్తుంది. అందుకే బయ్యర్లు ఆశలు పెట్టుకుంటున్నారు.

కెప్టెన్ మిల్లర్ లో ప్రత్యేకతలున్నాయి. ఇది బ్రిటిషర్ల కాలంలో జరిగే పీరియాడిక్ డ్రామా. శివరాజ్ కుమార్ తో పాటు మన సందీప్ కిషన్ కీలక పాత్ర పోషించాడు. పవన్ కళ్యాణ్ ఓజిలో ఛాన్స్ కొట్టేసిన ప్రియాంకా మోహన్ హీరోయిన్. జివి ప్రకాష్ కుమార్ నేపధ్య సంగీతం మీద ప్రత్యేక ప్రశంసలు దక్కాయి. ఒరిజినల్ వెర్షన్ యునానిమస్ గా బ్లాక్ బస్టర్ అనిపించుకోలేదు కానీ రివ్యూస్, టాక్ బాగానే వచ్చి ప్రస్తుతం 50 కోట్ల మార్కుకి దగ్గరలో ఉంది. దీనికన్నా కమర్షియల్ గా ఆయలాన్ ముందంజలో ఉంది. కెప్టెన్ మిల్లర్ కన్నా ఒక రోజు లేట్ గా అయలాన్ తెలుగు జనవరి 26 ప్లాన్ చేస్తున్నారని టాక్.