సంక్రాంతి సినిమాల్లో సైంధవ్ చివరి స్థానంలో నిలవడం ఖరారైపోయినట్టే. ప్రధాన కేంద్రాల్లో వసూళ్లు డీసెంట్ గా కనిపిస్తున్నా వాటిలో చాలా మటుకు హనుమాన్ తో పాటు ఇతర చిత్రాల ఓవర్ ఫ్లోస్ వల్ల వచ్చినవేనని ట్రేడ్ అభిప్రాయపడుతోంది. వెంకటేష్ ఫ్యామిలీ ఇమేజ్ కన్నా కంటెంట్ లోని ఓవర్ సీరియస్ నెస్ గురించి వచ్చిన టాకే ఆడియన్స్ ని దూరం చేస్తున్న మాట వాస్తవం. దర్శకుడు శైలేష్ కొలను ప్రెజెంటేషన్ మరీ దారుణంగా లేకపోయినా ఫీడ్ బ్యాక్ ఇంత వీక్ గా రావడానికి సగం కారణం సంగీత దర్శకుడు సంతోష్ నారాయణనని చెప్పక తప్పదు. ఫ్యాన్స్ కంప్లయింట్ కూడా ఇదే.
గత ఏడాది నాని దసరాకు అదిరిపోయే పాటలతో పాటు సూపర్ బీజీఎమ్ ఇచ్చిన సంతోష్ ఇప్పుడు సైంధవ్ విషయంలో చేతులు ఎత్తేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఏ ఒక్క సాంగ్ పబ్లిక్ లో పూర్తిగా రిజిస్టర్ కాలేదు. వైరల్ కావడం దేవుడెరుగు కనీసం ఛార్ట్ బస్టర్ అనిపించులేక పోయాయి. ఇంట్రో తర్వాత మందు కొట్టే పాటతో మొదలుపెట్టి చివర్లో ఎమోషనల్ సాంగ్ దాకా అన్నీ సోసోనే. ఇక వెంకీ ఊర మాస్ యాక్షన్ ఎపిసోడ్స్ లో ఎంత గొప్పగా నటించినా సరిగా ఎలివేట్ కాకపోవడానికి కారణం నేపధ్య సంగీతం అంతగా సింక్ అవ్వకపోవడమే. దీంతో సినిమా నీరసంగా అనిపిస్తుంది.
ఇది రాబట్టుకోలేని శైలేష్ తప్పా లేక ఇవ్వలేని సంతోష్ తప్పా అంటే సమాధానం వాళ్ళిద్దరికే తెలుసు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే పోటీలో ఉన్న సినిమాలు అన్నింటిలో ఎలాంటి ఒత్తిడి లేకుండా టైంకి షూటింగ్ పూర్తి చేసుకున్నది సైంధవే. అంటే సంతోష్ నారాయణన్ మీద ఎలాంటి ఒత్తిడి లేదు. అలాంటప్పుడు బెస్ట్ ఆశించడంలో తప్పేమీ లేదు. అనిరుద్ రవిచందర్ వల్లే జైలర్, లియో, విక్రమ్ స్థాయి పెరిగిందనేది ఎవరూ కాదనలేని వాస్తవం. అంత కాకపోయినా కనీసం అందులో సగం అందుకున్నా చాలు సైంధవ్ కాస్త ఎక్కువ జనాలకు రీచ్ అయ్యుండేదేమో. కానీ జరగలేదు.