గుంటూరు కారంలో మహేష్ బాబు సరసన మెయిన్ హీరోయిన్ గా ప్రమోషన్ కొట్టేసిన శ్రీలీల ఎదురు చూపులు ఈ రోజు ఫలించాయి. థియేటర్లో బొమ్మ పడిపోయింది. రిపోర్ట్స్ ఏమో కానీ రమణ బ్యాటింగ్ మాములుగా లేదు. అత్యధిక థియేటర్లలో విడుదలైనా వసూళ్లు గట్టిగానే ఉన్నాయి. పండగ హడావిడి తగ్గేలోపు ఎంత వసూలు చేస్తుందనేది కీలకం కానుంది. వీటి సంగతి కాసేపు పక్కన పెడితే త్రివిక్రమ్ అంతటి దర్శకుడు సైతం తన డాన్సులకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వడం ఆసక్తి రేపుతోంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మహేష్ బాబే తాట తెగిపోతుందని చెప్పడం వైరలైన సంగతి తెలిసిందే.
ఇదంతా బాగానే ఉంది కానీ కేవలం డాన్సులతో శ్రీలీల ఎక్కువ కాలం నెట్టుకురావడం కష్టం. ఎందుకంటే విజయశాంతి భానుప్రియ జమానా నుంచి రమ్యకృష్ణ మీనాల తర్వాత రష్మిక మందన్న వరకు ప్రతి ఒక్కరి కెరీర్లో పెర్ఫార్మన్స్ కు దోహద పడిన పాత్రలు పడ్డాయి కాబట్టే గ్రాఫ్ పరంగా గొప్పగా చెప్పుకునే సందర్భాలు వచ్చాయి. కానీ శ్రీలీలకు అలాంటి బ్రేక్ ఇంకా దక్కలేదు. భగవంత్ కేసరి బ్లాక్ బస్టరైన దాని ఫలితంలో సింహభాగం బాలకృష్ణకే చెందుతుంది. కనక శ్రీలీలకు దక్కిన షేర్ తక్కువే. అయినా సరే కెరీర్ బెస్ట్ లో ఈ సినిమానే నెంబర్ వన్ లో ఉంటుందని తనే చెప్పింది.
గత ఏడాది మూడు డిజాస్టర్లు పడ్డాయి. గుంటూరు కారం ఫైనల్ స్టేటస్ ఇంకో వారంలో తేలిపోతుంది. ఇకపై వచ్చే కథల విషయంలో అమ్మడు జాగ్రత్తగా అడుగులు వేయాల్సి ఉంటుంది. ఉత్తి డాన్సుల కోసమే అయితే క్రమంగా ప్రేక్షకులకు బోర్ కొట్టే ప్రమాదం లేకపోలేదు. ఆదికేశవ, ఎక్స్ ట్రాడినరి మ్యాన్, స్కందలో జరిగిన పొరపాటు ఇదే. ధమాకాలో క్లిక్ అయ్యాయని చెప్పి పదే పదే ఎక్కువ డాన్సులు ఉండేలా చేయడం హీరోలకు సైతం ఇబ్బందులు తెచ్చి పెడుతోంది. ఛాలెంజ్ అనిపించే క్యారెక్టర్లు చేస్తేనే గుర్తింపు ఎక్కువ కాలం నిలుస్తుంది. కేవలం గ్లామర్ డాల్ బ్రాండ్ ఒకటే ఉంటే సరిపోదు.