మూడు రోజుల క్రితం మా సైట్ రివీల్ చేసినట్టు కల్కి 2898 ఏడి విడుదల మే 9కి అఫీషియల్ గా లాక్ అయ్యింది. వైజయంతి మూవీస్ బ్యానర్ లో అత్యంత ప్రతిష్టాత్మక బ్లాక్ బస్టర్స్ గా నిలిచిన జగదేకవీరుడు అతిలోకసుందరి, మహానటిలు వచ్చిన తేదీ కావడంతో నిర్మాత అశ్వినీదత్ బృందం దాన్ని సెంటిమెంట్ గా భావిస్తోంది. అయితే ప్రభాస్ ఫ్యాన్స్ ఈ అనౌన్స్ మెంట్ పట్ల సంతోషంగా ఉన్నారు కానీ నిజంగానే ఆ డేట్ కి కట్టుబడతారా అనేది పెద్ద ప్రశ్న. ఎందుకంటే ఆల్రెడీ జనవరి నుంచి ఒకసారి వాయిదా వేసుకుని ఇప్పుడు అయిదు నెలల గ్యాప్ తో మే కి షిఫ్ట్ చేసుకుంది.
దర్శకుడు నాగఅశ్విన్ కల్కిని అంతర్జాతీయ స్థాయిలో ప్రమోట్ చేసేందుకు ఏ చిన్న అవకాశాన్ని వదిలిపెట్టడం లేదు. పబ్లిసిటీని వెరైటీగా ప్లాన్ చేస్తున్నారు. ఇవాళ రిలీజ్ డేట్ ని పలు మల్టీప్లెక్సులకు కల్కిలో ఉన్న పాత్రధారుల గెటప్ లో ఉన్న వాళ్ళను పంపించి ఆడియన్స్ ని సర్ప్రైజ్ చేసి శుభవార్త చెప్పారు. రాబోయే రోజుల్లో ఇలాంటి ఇన్నోవేటివ్ ఐడియాలు చాలా చేస్తారట. ఇవాళ వచ్చిన కొత్త పోస్టర్ లో ప్రభాస్ సూపర్ హీరో గెటప్ లో కనిపించడం అంచనాలు పెంచింది. ఐరన్ మ్యాన్, సూపర్ మ్యాన్ రేంజ్ లో మానవాతీత శక్తులున్న క్యారెక్టర్ లో డార్లింగ్ ని చూడబోతున్నాం.
6000 సంవత్సరాల క్రితం అంతరించిన కథతో కల్కి 2898 ఏడి మొదలవుతుంది. ఊహించని ఫాంటసీ ఎలిమెంట్స్ చాలా ఉంటాయి. అమితాబ్ బచ్చన్, దీపికా పదుకునే, దిశా పటాని తదితరులు నటించడంతో హిందీ వెర్షన్ కు భారీ డిమాండ్ ఉంది. సంతోష్ నారాయణన్ సంగీతం మరో ఆకర్షణ కానుంది. దీని షూటింగ్ ప్రస్తుతం చివరి దశలో ఉంది . రెండు భాగాలు కాబట్టి సీక్వెల్ 2025లో రిలీజ్ ఉండొచ్చు. వరసగా సాహో, రాధే శ్యామ్, ఆదిపురుష్ లు నిరాశ పరిచినా సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ ఫ్యాన్స్ కి ఊరటనిచ్చింది. కల్కి కూడా ఇదే బాట పడితే నేషనల్ వైడ్ సెన్సేషన్ కామన్.