హనుమాన్ టీమ్.. మిస్ అవుతున్న పాయింట్

ఈ ఏడాది సంక్రాంతి సినిమాల్లో ముందుగా ప్రేక్షకులు పలకరిస్తున్నది హనుమాన్ చిత్రమే. ఈ చిత్రం గుంటూరు కారంతో పాటే జనవరి 12న రిలీజ్ కావాల్సి ఉండగా.. అంతకంటే ఒకరోజు ముందే పెద్ద ఎత్తున పెయిడ్ ప్రీమియర్ షోలు పడుతున్నాయి. గురువారం సాయంత్రం ఫస్ట్ షో నుంచే హనుమాన్ సందడి మొదలవుతుంది. బుకింగ్స్ ఓపెన్ అయిన షోలకు అదిరిపోయే రెస్పాన్స్ కూడా వస్తోంది.

సినిమాకు మంచి టాక్ రావాలి కానీ సంక్రాంతికి రిలీజ్ అవుతున్న మిగతా పెద్ద సినిమాలను డామినేట్ చేసినా ఆశ్చర్యం లేదు. అయితే ఇప్పటికే హనుమాన్ కు మంచి బజ్ వచ్చింది కానీ.. సినిమాను ప్రమోట్ చేసే విషయంలో ఒక కీలకమైన పాయింట్ ను హనుమాన్ టీం వదిలిపెట్టిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

బేసిగ్గా హనుమాన్ తరహా సినిమాలు పిల్లలకు బాగా నచ్చుతాయి. హనుమంతుడు అనే క్యారెక్టర్ పిల్లలకు చాలా చాలా ఇష్టం. ఇక ఆ పాత్ర చేసే విన్యాసాల చుట్టూ సినిమా అంటే ఇక వాళ్ళు ఎంతగా ఆసక్తి చూపిస్తారో చెప్పేదేముంది? పైగా హనుమాన్ విజువల్ ఎఫెక్ట్స్ తో ముడిపడ్డ చిత్రం.

హనుమంతుడు- విజువల్ ఎఫెక్ట్స్.. ఈ కాంబినేషన్ పిల్లలను బాగా ఆకర్షిస్తుంది. అలాంటప్పుడు చిత్ర బృందం సంబంధిత ప్రోమోలతో పిల్లలను ఆకట్టుకునే ప్రయత్నం చేయాల్సింది. వాళ్లకు హనుమాన్ సినిమాను ఎక్కువ చేరువ చేయడానికి ప్రయత్నించి ఉంటే.. దీని రీచ్ ఇంకా పెరిగేది. ఇప్పటికే ఈ సినిమాపై పిల్లల్లో ఆసక్తి లేదని కాదు. కానీ దాన్ని ఇంకా పెంచడానికి హనుమాన్ టీం ప్రయత్నించాల్సింది. పిల్లలు బాగా ఆసక్తి చూపించారంటే ఫ్యామిలీ ఆడియన్స్ పెద్ద ఎత్తున థియేటర్లకు వస్తారు. దానివల్ల సినిమా రేంజ్ మారిపోతుంది.