గుంటూరు కారం.. అక్కడ మామూలు మోత కాదు

ఈ ఏడాది సంక్రాంతి సినిమాల సందడికి ఇంకో 5 రోజుల సమయమే ఉంది. యూఎస్ ప్రీమియర్స్ తో మొదలు పెట్టుకుంటే మిగిలి ఉన్నది నాలుగు రోజులే. సలార్ సందడి తర్వాత కొంచెం డల్ అయిన బాక్స్ ఆఫీస్ కు ఈ నెల 11న ఊపు రాబోతోంది.

ఆ రోజే మహేష్ బాబు- త్రివిక్రమ్ సినిమా గుంటూరు కారం యూఎస్ ప్రీమియర్స్ పడబోతున్న సంగతి తెలిసిందే. ప్రీమియర్స్ వరకు అమెరికాలో ఈ సినిమాకు సలార్ కంటే ఎక్కువ స్క్రీన్లు, షోలు దక్కడం విశేషం. సలార్ లాగా దీనికి అస్సలు పోటీ లేదు. పైగా మహేష్ బాబుకు, త్రివిక్రమ్ కు వేరువేరుగా యుఎస్ లో మంచి మార్కెట్ ఉంది. దీంతో రికార్డ్ స్థాయిలో ప్రీమియర్ షోలు పడబోతున్నాయి.

యుఎస్ లో జనవరి 11న 5408కి పైగా స్పెషల్ ప్రీమియర్ షోలని ప్రదర్శించనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇంత భారీ స్థాయిలో యుఎస్ లో ప్రీమియర్స్ పడనున్న తొలి తెలుగు (సింగిల్ లాంగ్వేజ్) గుంటూరు కారం రికార్డు నమోదు చేయబోతుండడం విశేషం.

కొన్ని రోజుల ముందు వరకు గుంటూరు కారం ప్రీమియర్ సేల్స్ ఓ మోస్తరుగానే ఉన్నాయి. కానీ రిలీజ్ వెయిట్ లోకి అడుగు పెట్టగానే కథ మారిపోయింది. ఒక్కసారిగా సేల్స్ ఊపందుకున్నాయి. ఆల్రెడీ ఈ సినిమా ప్రీమియర్ సేల్స్ హాఫ్ మిలియన్ మార్కుకు చేరువయ్యాయి.

నంబర్ ఆఫ్ స్క్రీన్స్, షోల లెక్క చూస్తుంటే.. ఈజీగా సినిమా ప్రీమియర్స్ తోనే 1.5 మిలియన్ డాలర్ల మార్కును అందుకునేలా కనిపిస్తోంది. యావరేజ్ టాక్ వచ్చినా సరే గుంటూరు కారం నాలుగు మిలియన్ డాలర్లు కొల్లగొట్టడం ఖాయం. టాక్ బాగుండాలి కానీ ఈ సినిమా మహేష్ బాబు కెరీర్లో హైయెస్ట్ గ్రాసర్ కావడం లాంఛనమే.