ఈగల్ వాయిదా కొత్త ప్రచారంలో నిజమెంత

చిన్న అగ్గిపుల్ల వెలిగిస్తే అడివంతా కాల్చినట్టు సోషల్ మీడియా వ్యవహారం అలాగే ఉంది. ఈగల్ వాయిదా లేదని నిర్మాతలు ఇప్పటికి ఓ పదిసార్లు చెప్పి ఉంటారు. అయినా సరే పదే పదే ప్రచారం ఆగటం లేదు. తాజాగా సంక్రాంతి బరి నుంచి తప్పుకుని జనవరి 26కి షిఫ్ట్ అవుతోందనే వార్త పలు పేరున్న ట్విట్టర్ హ్యాండిల్స్ లో రావడంతో ఒక్కసారిగా అభిమానుల్లో అయోమయం తలెత్తింది. కొద్ది నిమిషాల క్రితమే సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుని, యు/ఏ సర్టిఫికెట్ తీసుకుని కొత్త పోస్టర్ ని జనవరి 13 డేట్ తో వదిలినా సరే పోస్ట్ పోన్ పబ్లిసిటీ మాత్రం అనఫీషియల్ గా జరుగుతూనే ఉంది .

నిజానికి ఈగల్ ముందు చెప్పిన తేదీకే కట్టుబడి ఉంది. ఎలాంటి మార్పు లేదు. ఓటిటి డీల్ ఇంకా పూర్తవ్వకపోవడంతో పాటు థియేటర్ల సమస్య ఉంది కాబట్టి తప్పుకోవడం తప్ప వేరే మార్గం లేదనే రీతిలో ఇండస్ట్రీ వర్గాలు కూడా మాట్లాడుకున్నాయి. బీసీ సెంటర్లలో స్క్రీన్లు దొరకడం ఈగల్ కి దుర్లభంగా మారింది. అందుకే వేరే డేట్ అయితే మంచి ఓపెనింగ్స్, రెవిన్యూ వస్తాయనే అభిప్రాయం ట్రేడ్ లో ఉంది. కానీ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ మాత్రం వెనుకడుగు వేసేందుకు ఎంత మాత్రం ఇష్టపడటం లేదు. సైంధ‌వ్‌ తో పాటుగా ఒకే రోజు అమితుమీ తేల్చుకునేందుకు రెడీ అవుతోంది.

కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈగల్ సీరియస్ సబ్జెక్టు కాదని, ఫ్యామిలీ ఆడియన్స్ మెప్పించే అంశాలు అన్ని ఉంటాయని కొత్త ట్రైలర్ తో క్లారిటీ ఇస్తామని మేకర్స్ చెబుతూనే ఉన్నారు. గుంటూరు కారం, హనుమాన్, నా సామిరంగ, సైంధ‌వ్‌ లతో కాంపిటీషన్ ని ఎదురుకోవడం ఈగల్ కు అంత సులభంగా ఉండదు. ధమాకా తర్వాత వరస ఫ్లాపులు మాస్ మహారాజా మార్కెట్ ని ఇబ్బంది పెడుతున్నాయి. వాల్తేరు వీరయ్య బ్లాక్ బస్టర్ ఉన్నా అది చిరంజీవి ఖాతాలోకి వస్తుంది. సో ఈగల్ కు వీలైనంత బెస్ట్ టాక్ రావడం చాలా అవసరం. ఇంకో పదే రోజుల్లో మ్యాటర్ తేలిపోతుంది.