సామిరంగ సంక్రాంతికే – వేడెక్కిన పోటీ

ఎన్నో సందేహాలు, చర్చల మధ్య నా సామిరంగ వాయిదా పడుతుందేమోనని ఎదురు చూసిన పోటీదారులకు ఎలాంటి శుభవార్త చెప్పే అవకాశం లేకుండా నాగార్జున తన సినిమా విడుదల తేదీని జనవరి 14కే ఫిక్స్ చేసుకున్నారు. నిజానికీ డేట్ నాలుగైదు రోజుల క్రితమే లాక్ చేసుకుని ఆ మేరకు పోస్టర్ డిజైన్ కూడా చేసుకున్నారు. కానీ నిర్మాత ఇంకా ఓటిటి డీల్ పూర్తవ్వకపోవడంతో పాటు ఇంత పోటీ మధ్య వసూళ్ల మీద ప్రభావం పడుతుందేమోననే అనుమానంతో కొంత తడబడిన మాట వాస్తవం. అయితే కింగ్ ఎట్టి పరిస్థితుల్లో వెనక్కు తగ్గకూడదని నిర్ణయించుకోవడంతో డెసిషన్ వచ్చేసింది.

ఫైనల్ గా ఇంకెవరూ వెనక్కు తగ్గే ప్రసక్తే లేదని అర్థమైపోయింది. నా సామిరంగ మీద నాగ్ ఇంత పట్టుదలగా ఉండటానికి కారణం లేకపోలేదు. సోగ్గాడే చిన్ని నాయనా, బంగార్రాజులకు సంక్రాంతి సెంటిమెంట్ బాగా కలిసి వచ్చింది. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదులుకోకూడదని భావించి హ్యాట్రిక్ కోసం పట్టుబడుతున్నారు. విజయ్ బిన్నీ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ విలేజ్ డ్రామాలో అల్లరి నరేష్, రాజ్ తరుణ్ పాత్రలు కీలకంగా ఉండబోతున్నాయి. హీరోయిన్ ఆశికా రంగనాథ్ గ్లామర్ ఆకర్షణగా ఉండబోతోందని ప్రోమోలు, టీజర్ చూశాక అర్థమైపోయింది.

ఇకపై ప్రమోషన్లతో అయి;దు సినిమాలు ఉక్కిరిబిక్కిరి చేయబోతున్నాయి. దేనికవే అంచనాల పరంగా ప్రత్యేకత ఉన్నవి కావడంతో మూవీ లవర్స్ పర్సులకు పెద్ద పరీక్ష ఎదురు కానుంది. థియేటర్ల సర్దుబాటు అతి పెద్ద సమస్యగా మారుతుందనే బయ్యర్ల భయమే నిజం కానుంది. ఎవరికి తగ్గట్టు వాళ్ళు స్క్రీన్లు సమకూర్చుకున్న ఓపెనింగ్స్ ని పంచుకోవాల్సి రావడం ఖచ్చితంగా వసూళ్ల మీద ప్రభావం పడుతుంది. ఇవాళ సాయంత్రం నా సామిరంగ టైటిల్ సాంగ్ రిలీజ్ చేయబోతున్నారు. చాలా కాలం తర్వాత కీరవాణి మాస్ ని చూడబోతున్నారని ఇప్పటికే యూనిట్ తెగ ఊరిస్తోంది.